Parakamani Case: తిరుమల పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ హైకోర్టు అవినీతి నిరోధక శాఖ డీజీ, సీఐడీ అధికారులకు అనుమతి ఇచ్చింది. లోక్ అదాలత్‌లో జరిగిన రాజీ వ్యవహారం, కేసులో నిందితుడైన రవి కుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాల్సిందిగా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదనంగా, ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని ఏసీబీ, సీఐడీ అధికారులకు సూచనలు ఇచ్చి విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.
ఇప్పటికే సీఐడీ సమర్పించిన అదనపు నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ నిర్ణయాలు తీసుకుంది. పరకామణి చోరీ కేసును మొదటగా వెలుగులోకి తీసుకు వచ్చిన ఫిర్యాదుదారుడు, టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కేసుకు మరో మలుపు తిప్పింది. రైలుపట్టాల వద్ద అతని శవం లభ్యమైన తర్వాత మొదట దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. అయితే తదుపరి దర్యాప్తులో ఇది హత్య అని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో సతీష్ కుమార్ పోస్టుమార్టం నివేదికను సీల్డు కవర్లో హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందించాలని సీఐడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే ఈ కేసు దర్యాప్తు మరింత సమగ్రంగా సాగేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ శాఖలతో సమాచార పంచుకోవాలని కోర్టు సూచించింది.
కేసు ఇదీ..
2023 మార్చిలో తిరుమల పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ జరిగిన ఘటన ఈ కేసుకు మూలం. టీటీడీ ఉద్యోగి రవి కుమార్ విదేశీ కరెన్సీని అపహరించేందుకు యత్నించగా రంగే హస్తంగా పట్టుబడ్డాడు. అయితే టీటీడీ పూర్తిస్థాయి విచారణ జరపలేదని, అప్పటి పాలకవర్గం ఈ కేసును లోక్ అదాలత్ రాజీతో ముగించిందని ఆరోపణలు రావడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. దర్యాప్తు వేగవంతం చేసే క్రమంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా పలువురు అధికారులను విచారించారు. ఈ పరిణామాలన్నీ కలిసి తిరుమల పరకామణి చోరీ కేసును రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యమైనదిగా నిలిపాయి. విచారణలో వెలుగులోకి వచ్చే తదుపరి విషయాలపై ఇప్పుడు రాష్ట్ర దృష్టి సారించింది.