టి20 ప్రపంచకప్ 2026 ఘనంగా ఆరంభమైంది. ఈసారి 20 జట్లతో టోర్నీ జరుగుతోంది. తొలి రెండు రోజుల్లో పసికూన జట్లు పెద్ద జట్లను దాదాపుగా ఓడించేంత పని చేశాయి. పాకిస్తాన్‌ను నెదర్లాండ్స్.. భారత్‌ను అమెరికా.. ఇంగ్లండ్‌ను నేపాల్ హడలెత్తించాయి. పాకిస్తాన్, ఇంగ్లండ్ అయితే త్రుటిలో ఓటముల నుంచి తప్పించుకున్నాయి. ఒకపక్క టి20 ప్రపంచకప్ జరుగుతుంటే మరోపక్క. భారత్, పాకిస్తాన్ మ్యాన్‌పై అనిశ్చితి ఇంకా నెలకొనే ఉంది. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్ 'ఎ'లో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ను తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ ఆర్థిక విషయాలతో ముడిపడి ఉంది. దాంతో షెడ్యూల్ ప్రకారమే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరిగేందుకు ఐసీసీ కృషి చేస్తుంది. ఈ క్రమంలో ఐసీసీ మధ్యవర్తిగా.. పీసీబీ, బీసీసీఐల మధ్య సమావేశం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆదివారం (ఫిబ్రవరి 08) ఐసీసీ ప్రతినిధులు లాహోర్‌లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో పాక్ ప్రభుత్వం తరపున పీసీబీ మూడు ప్రధాన డిమాండ్లను ఐసీసీ ముందు ఉంచింది. అయితే ఈ మూడు డిమాండ్లు పాకిస్థాన్ కోసం కాకుండా, టోర్నమెంట్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్ కోసం ఉండటం గమనార్హం. బంగ్లాదేశ్‌కు నష్ట పరిహారం చెల్లించడం. టి20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌కు నష్టపరిహారం చెల్లించాలంటూ పీసీబీ కోరింది. అంతేకాకుండా ఈ నష్టపరిహారాన్ని భారీ మొత్తంలో ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ ఆడకపోయినా.. ఆ జట్టు ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులను చెల్లించాలంటూ కోరిందని సమాచారం. ఇది కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. వారు ఆడకపోయినా ఆడినట్లుగా భావించి పార్టిసిపేషన్ ఫీజును చెల్లించడం ఏంటంటూ ఐసీసీ అధికారులు ముక్కన వేలేసుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐసీసీ టోర్నీలను బంగ్లాదేశ్‌లో హోస్ట్ చేసేలా హామీ ఇవ్వాలని పాకిస్తాన్ కోరినట్లు సమాచారం. 2026 టి20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఐసీసీ ఆగ్రహంతో ఉంది. కొన్నేళ్ల పాటు బంగ్లాదేశ్‌లో ఎటువంటి ఐసీసీ టోర్నీలను నిర్వహించకూడదనే ఉద్దేశంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఈ డిమాండ్ చేయడం విచిత్రం. ఈ మూడు డిమాండ్లతో బంగ్లాదేశ్ ప్రజల దృష్టిలో హీరోల్లా నిలవాలనే ఉద్దేశంలో పాకిస్తాన్ ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలను ఆ దేశ ప్లేయర్లే ఒప్పుకోవడం లేదు. గతంలో మాదిరి పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే ఎగబడి చూసే అభిమానులు ఇప్పుడు లేరు. పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జట్లతో భారత్ ఆడుతుంటే చూసేందుకు అభిమానులు ఇష్టపడుతున్నారు. కాబట్టి.. పాకిస్తాన్ గొంతెమ్మ కోరికలను మన్నించకుంటేనే బాగుంటుంది. లేదటే ఐసీసీ మెడలు వంచినం.. అంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకోవడం ఖాయం.