చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రీక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో ప్రవంచ నాలుగో ర్యాంకర్, చైనా స్టార్ చెన్ యుఫేయీ 16-21, 22-20, 21-18తో సింధుపై విజయం సాధించింది. గంటా 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరి వరకు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఇటీవల జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచి మంచి జోష్‌లో ఉన్న సింధు తొలి గేమ్‌ను అద్భుతంగా కైవసం చేసుకుంది. రెండో గేమ్ లోనూ విజయం అంచుల వరకు వెళ్లిన ఆమె నాలుగు మ్యాచ్ పాయింట్లను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న యుఫేయీ రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. మూడో గేమ్‌లోనూ ఇద్దరూ నువ్వా-నేనా అన్నట్లుగా పోరాడినా, చివర్లో యుఫేయీ కీలక పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. దీంతో గతవారం జపాన్ ఓపెన్ సెమీఫైనల్లో ఎదురైన ఓటమికి యుఫేయీ ప్రతీకారం తీర్చుకున్నట్టైంది. ఈ ఓటమితో చైనా ఓపెన్‌లో సింధు పోరాటం. ముగిసింది. అయితే మ్యాచ్ మొత్తం అత్యున్నత స్థాయి ర్యాలీలు, పోరాట స్ఫూర్తితో సాగి అభిమానులను అలరించింది.