ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పశ్చిమ బెంగాల్ - అస్సాం రాష్ట్రాల్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ బెంగాల్లో సుమారు ₹3,200 కోట్ల విలువైన ప్రాజెక్టులు, అస్సాంలో సుమారు ₹15,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం - శంకుస్థాపన చేయనున్నారు.
పర్యటనలో తొలి రోజున ప్రధాని పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఉన్న రాణాఘాట్ కు ఉదయం 11:15 గంటలకు చేరుకుంటారు. అక్కడ జాతీయ రహదారి 34లో భాగమైన బరజగులి–కృష్ణానగర్ మధ్య 66.7 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల రహదారి మార్గాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఈ రహదారి ప్రారంభంతో స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం పెరగడంతో పాటు సరుకు రవాణా వేగవంతం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజా ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడనున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో జాతీయ రహదారి 34లోని బరాసత్–బరజగులి మధ్య 17.6 కిలోమీటర్ల సెక్షన్ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కోల్కతా నుంచి సిలిగురి వరకు ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గే అవకాశం ఉంది. దీంతో వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు.
రెండో రోజు కోసం ప్రధాని శనివారం సాయంత్రం అస్సాంలోని గువాహటికి చేరుకుంటారు. అక్కడ దేశంలోనే ప్రత్యేకత కలిగిన ప్రకృతి నేపథ్యంతో నిర్మించిన గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. వెదురు తోటలతో రూపొందించిన ఈ టెర్మినల్ పర్యావరణ అనుకూలంగా ఉండటమే కాకుండా, ఏటా సుమారు 13 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ టెర్మినల్ ఫోటోలను ప్రధాని ఇటీవల సోషల్ మీడియా వేదిక Xలో పంచుకోవడం గమనార్హం.