చట్టం చేస్తున్నాం... బీసీలకు సంరక్షణ కల్పిస్తాం
చేనేతలకు మేలు చేసేది.. అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమే
ఆర్థిక కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధిలో రాజీవడడం లేదు
కుటుంబానికి ఇల్లు... రాష్ట్రానికి రాజధాని అవసరం
జెన్-జీ అభివృద్ధి కోరుకుంటోంది...జనరేషన్ గొడ్డలి కుట్రలు పన్నుతోంది
44 ఏళ్లు వస్తే వయసైపోయినట్టా..?
12వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు
'నేతన్న సేవలో' పథకం ప్రారంభం..
71,536 చేనేత కుటుంబాలకు రూ. 179 కోట్లు జమ
బీసీల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని, ఇందుకు సంబంధించిన ముసాయిదా ఇప్పటికే సిద్ధమైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించి, అర్హులైన 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, శ్రీకాళహస్తి, సరసాపురం వంటి ప్రాంతాల చేనేత ఉ త్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. రాష్ట్రంలో 1.27 లక్షల మంది చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ఉచిత విద్యుత్, 50 ఏళ్లకే ఎన్టీఆర్ పెన్షన్ భరోసా, చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్, క్లస్టర్ అభివృద్ధి, మార్కెటింగ్ నదుపాయాలు, హ్యాండ్లూమ్ పార్కులు, చేనేత మ్యూజియం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మత్స్యకారులకు ఆర్ధిక సాయం, వడ్డెరలకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్ షాపులు, బీసీలకు సోలార్ రూఫ్ టాప్ సబ్సిడీ, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉ న్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిలో ఎక్కడా రాజీ పడలేదని, గత రెండేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల సంక్షేమం, రూ.1.34 లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి రాజధాని అవసరమని, కుటుంబానికి ఇల్లు ఎంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాజధానిని నిర్లక్ష్యం చేసి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు తిరిగి ప్రారంభించామని, ఆగస్టు 13న సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం కానుందని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపిస్తున్నామని, "వాళ్లది బ్యాడ్ ఇమేజ్... మాది బ్రాండ్ ఇమేజ్' అని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు కల్పించామని, ఇప్పుడు పేపర్ లీక్ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జెన్-జీ యువత అభివృద్ధిని కోరుకుంటుంటే కొందరు అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేసిన సీఎం, ప్రజలు కుట్ర రాజకీయాలను గమనించి అప్రమత్తంగా ఉండాలని కోరారు. చీరాలకు గత వైభవాన్ని తీసుకురావడంతో పాటు సూర్యలంక-చీరాల పర్యాటక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.