నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అడవితల్లిబాట పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహిస్తూ అడవితల్లిబాట పనుల పురోగతిపై చర్చించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లా కలెక్టర్లు ,శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. డోలీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అడవితల్లిబాట తొలి దశలో రూ. 1005 కోట్ల అంచనా వ్యయంతో 1069 కి.మీ మేర రహదారులు అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తూ అడవితల్లిబాట 2.0ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ విస్తరణతో మొత్తం ప్రాజెక్టును రూ.2078 కోట్ల అంచనా వ్యయంతో 2310 కి.మీ మేర రహదారుల అభివృద్ధికి విస్తరించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 905కి.మీ మేర రహదారుల నిర్మాణం పూర్తయిందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.