కొన్ని సినిమాలు డబ్బులు...మరికొన్ని సినిమాలు పేరునీ తీసుకొస్తాయి. గౌరవం మాత్రం చాలా కొన్ని సినిమాలే తీసుకొస్తాయి. 'నువ్వు నాకు నచ్చావ్' అలాంటి ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.ఆయన రచయితగా, విజయ్ భాస్కర్. కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు. స్రవంతి రవికిశోర్ నిర్మాత. ఈ చిత్రం జనవరి 1న రీరిలీజ్ గా మరోసారి ప్రేక్షకల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ఈ సినిమా విడుదలై పాతికేళ్లయింది. ఇప్పటికీ 'నువ్వు నాకు నచ్చావ్' నిర్మాత అంటే నన్ను చూసే విధానం వేరుగా ఉ ంటుంది. ఈ సినిమా రూపొందడానికీ, ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం వెంకటేశ్. నటుడిగా ఎంతో అద్భుతంగా చేశారు. ఇతర నటులు, దర్శకుడు విజయ్-భాస్కర్, రచయిత త్రివిక్రమ్, సంగీత దర్శకుడు కోటి... ప్రతి ఒక్కరి అత్యుత్తమ పనితీరు ఇందులో కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా ఇప్పటికీ అలా నిలిచిపోయింది. ఇప్పటిలా అప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇతరత్రా దేశాల్లో విడుదల చేయలేదు. ఇప్పుడు మాత్రం అన్ని ప్రాంతాల్లోని ప్రేక్షకులూ చూసి ఆస్వాదించేలా భారీస్థాయిలో విడుదలకు సిద్ధం చేశాం' అన్నారు.త్రివిక్రమ్ మాట్లాడుతూ ఈ సినిమా క్రెడిట్ అంతా కథానాయకుడు వెంకటేష్ కే దక్కుతుంది. కథ చెప్పిన వెంటనే ఆయన చేస్తానని ముందుకొచ్చారు. అందరి జీవితాల్లో భాగమైన ఓ సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులంతా కలిసి ఓటీటీ, టీవీ మాధ్యమాల్లో చూశారు. సామూహిక అనుభవం కోసం అందరూ కలిసి మరోసారి థియేటర్లలో చూస్తారు' అన్నారు.