పలు అభివృద్ది పనులకు చంద్రబాబు శ్రీకారం
ఉత్సాహంగా పాల్గొన్న చంద్రబాబు కుటుంబం
ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన చంద్రబాబు
ఆటలు, రంగువల్లులతో అలరించిన పోటీలు
గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పలు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రంగంపేట భీమవరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారురోడ్డును సీఎం ప్రారంభించారు. అలాగే చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు.. తిరుమల, తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణ్ డ్యామ్‌కు కృష్ణా జలాలను తీసుకురావడానికి రూ.126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు.స్వర్ణ నారావారిపల్లి అభివృద్ధిలో భాగంగా అధునాతన సాంకేతికతను ఉపయోగించి 4.2 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషనన్ను సీఎం ప్రారంభించారు. అలాగే ప్రకృతి వ్యవసాయ మోడల్ ప్లాంటేషన్, డ్రోన్‌ను ఉపయోగించి మందులు పిచికారీ చేయటాన్ని ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, రుయా ఆసుపత్రులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. కాగా.. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లికి విచ్చేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి తదితర కుటుంబ సభ్యులు గ్రామస్థులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన వినోదాత్మక క్రీడలు, ముగ్గుల పోటీలు, రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలతో పాటు క్రీడా పోటీలను చంద్రబాబు దంపతులు ఆసక్తిగా తిలకించారు. పోటీలలో గెలుపొందిన చిన్నారులకు ఈ దంపతులు బహుమతులు అందజేశారు. నారావారిపల్లికి చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు క్రీడల్లో పాల్గొన్నారు. ఒక్కో స్కూల్ పిల్లలతో వేరు వేరుగా చంద్రబాబు దంపతులు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. అందరితో పాటు నారా, నందమూరి కుటుంబాలకు చెందిన పిల్లలు గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నారు. వీరిలో గెలుపొందిన వారికి అందరితో పాటు బహుమతుల ప్రదానం చేశారు. చంద్రబాబు ఇంటి ముందర ఉన్న గ్రౌండ్లో పోటీలు నిర్వహించి.. బహుమతులు అందజేశారు. ముఖ్యంగా సీఎం మనవడు నారా దేవాన్షి తన స్నేహితులతో కలిసి వివిధ గ్రామీణ క్రీడల్లో ఉ త్సాహంగా పాల్గొని అందరినీ మురిపించాడు. క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు ఇచ్చిన అనంతరం.. ఇంటికి వెళ్లే క్రమంలో దారి పొడవునా అర్జీలు స్వీకరించారు. ముఖ్యమంత్రికి అర్జీలు ఇవ్వడం కోసం పొరుగు జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అర్జీలు స్వీకరించడమే కాకుండా పరిష్కారం కోసం అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమాలతో నారావారివ్లలెలో సంక్రాంతి సంబరాలు మరింత ఉత్సాహంగా మారాయి. గ్రామ ప్రజలు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబం వారితో కలసి ముచ్చటించారు.