మెగాస్టార్ చిరంజీవి ఇంట మరోసారి పండగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల తనయుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వగా.. ఈ పిల్లలకు నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుక అనంతరం మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన మనవడు, మనవరాలి పేర్లను సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆ పేర్ల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగా కవలలకు శివరామ్ కొణిదెల, అన్వీర దేవి కొణిదెల అనే పేర్లను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. మనువడికి పెట్టిన 'శివ రామ్' అనే పేరు రెండు గొప్ప వ్యక్తిత్వాల కలయిక అని చిరంజీవి వివరించారు. తన అసలు పేరు శివ శంకర వరప్రసాద్లోని 'శివ' అనే పదం అంతర్గత శక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అయితే, రామ్ చరణ్ లోని 'రామ్' అనే పదం ధర్మానికి, కరుణకు చిహ్నమని పేర్కొన్నారు. అలాగే మనవరాలికి పెట్టిన 'అన్వీర దేవి' అనే పేరు దైవిక శక్తికి రూపమని, కనకదుర్గమ్మ తల్లి దీవెనలతో పెట్టిన ఈ పేరు భయం లేని తనాన్ని, అచంచలమైన ధైర్యాన్ని సూచిస్తుందని ఆయన తెలిపారు. అపరిమితమైన ఆనందంతో ఈ పేర్లను ప్రకటిస్తున్నామని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ చిన్నారులకు అందరి దీవెనలు ఉండాలని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.