విశాఖ తీరానికి పది నాటికల్ మైళ్ల దూరంలో శనివారం సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయినా సోమవారం రాత్రి వరకు వారి ఆచూకీ లభించలేదు. మునిగిపోయిన బోటు జాడ కూడా తెలియలేదు. ఈ నెల 1న సముద్రంలో చేపల వేటకు వెళ్లిన బోటు (ఐఎన్డీ-ఏపీ-ఎంఎ-వీఎస్-83) వేట ముగించుకొని తిరిగి తీరానికి వస్తుండగా శనివారం మధ్యాహ్నం సముద్రంలో బలమైన గాలులు, అలల ఉధృతికి బోల్తావడి మునిగిపోయిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు అందులోనే చిక్కుకుపోగా మిగిలిన ఆరుగురు (విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కారి చిన్న కారి గరగయ్య, అమర అప్పలరాజు, కారి సీతోడు, విశాఖ జిల్లా భీమిలి మండలం పెద నాగయ్యపాలేనికి చెందిన రగపతి బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు) రాత్రి తొమ్మిది గంటల వరకు ఈదుకుంటూ తీరం చేరే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరైన బోటు యజమాని కారి చిన్నాని చైనా వాణిజ్య నౌక సిబ్బంది రక్షించింది. కాగా, సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం కోస్టుగార్డు నుంచి కనకలత బారువా, వీర నౌకలు సోమవారం విస్తృతంగా గాలిస్తున్నాయి. తూర్పు నౌకాదళం నుంచి మూడు హెలికాప్టర్లు, నిఘా విమానం పీ8ఐ కూడా సముద్రం పైనుంచి వారి కోసం వెదుకుతున్నాయి. అయితే సోమవారం సాయంత్రం వరకు ఫలితం లభించలేదు. సెర్చ్ అండ్ రెన్యూ ఆపరేషన్‌ను కోన్టల్ సెక్యూరిటీ ఇన్చార్జి ఐజీ గోపీనాథ్ పర్యవేక్షిస్తున్నారు.
సముద్రంలో బోటు మునిగిపోయిన ప్రమాదంలో వాణిజ్య నౌక సిబ్బంది సాయంతో ప్రాణాలు దక్కించుకున్న మత్స్యకారుడు కారి చిన్నా సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. వాణిజ్య నౌకలో ఉన్న చిన్నాను నేవీ అధికారులు హెలికాప్టర్ సాయంతో ఎయిర్ లిఫ్ట్ చేసి సోమవారం రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు తీసుకువచ్చారు. అక్కడ అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగానే ఉన్నట్టు ధ్రువీకరించారు. కోస్టల్ సెక్యూరిటీ ఐజీ గోపీనాథ్ జట్టీ మెరుగైన వైద్యం కోసం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. కోలుకునా కోలుకున్నాక వివరాలు తెలుసుకుంటామని తెలిపారు. మునిగిపోయిన బోటు యజమాని చిన్నాయే కావడంతో అతని వద్ద పూర్తి సమాచారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని.. ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. భోగాపురం మత్స్యకారులు గల్లంతుపై విజయనగరం, విశాఖ కలెక్టర్లు రామ్ సుందర్‌రెడ్డి, అభిషిక్త్ కిషోర్ మంత్రి కొండపల్లి, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను రక్షించేందుకు చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు కలెక్టర్లు. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల నాయకుడితో ఫోన్లో మాట్లాడినట్లు మంత్రికి, ఎంపీకి వివరించారు కలెక్టర్లు. ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురికి లైఫ్ జాకెట్లు ఉన్నాయని.. ఒకరికి లైఫ్ జాకెట్ లేనట్లుగా చెప్పారు కలెక్టర్లు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లుగా చెప్పారు కలెక్టర్లు. సముద్ర తీర ప్రాంతానికి దగ్గర్లోనే ఉండటంతో మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి తెలిపారు. మత్స్యకారులను సేఫ్ గా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా గాలిస్తోందని మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి వివరించారు.