సోమవారం తెల్లవారుజామున సుమారు 4.24 నిమిషాలకు విశాఖపట్నం నగరాన్ని స్వల్ప భూకంపం వణికించింది. అకస్మాత్తుగా భూమి తేలికగా కంపించడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
స్థానికుల సమాచారం ప్రకారం, మురళీనగర్, గాజువాక, మాధురవాడ, MVP కాలనీ, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో భూమి స్వల్పంగా వణికినట్లు అనుభవించారు. కొంతమంది నివాస ప్రాంతాల్లో ప్రజలు భూకంపం అనిపించగానే ఇళ్ల బయటకు పరుగులు తీశారు. కొందరు భయంతో కొంతసేపు ఇళ్లలోకి వెళ్లకపోయినట్లు సమాచారం.
భూకంపశాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ భూకంపం తీవ్రత రిఖ్టర్ స్కేల్‌పై సుమారు 3.0 గా నమోదై ఉండవచ్చని తెలుస్తోంది. భూకంపం కేంద్ర బిందువు, ఖచ్చితమైన తీవ్రత వంటి వివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS)పరిశీలనలో ఉంది.
అధికారుల ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు. అయినప్పటికీ, భూకంపాలు ముందస్తు హెచ్చరికలేకుండా సంభవించే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నగర ప్రజలు సోషల్ మీడియా ద్వారా తమ అనుభవాలను పంచుకుంటూ, తెల్లవారుజామున తాము ఎదుర్కొన్న భయం గురించి వివరిస్తున్నారు. భూకంపం తక్కువ తీవ్రతగానే ఉన్నప్పటికీ, పౌరుల్లో ఒకింత భయాందోళన నెలకొన్నది.