శ్రీలంక క్రికెట్ జట్టుకు, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్? కి భారీ షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ పేసర్, బేబీ మలింగగా పిలవబడే మతీషా పతిరానా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి దాదాపుగా నిష్క్రమించాడు. కేవలం శ్రీలంకకే కాకుండా, అతన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన కేకేఆర్‌కు కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారింది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ పతిరానా గాయపడ్డాడు. తన మొదటి ఓవర్ (ఇన్నింగ్స్ 3వ ఓవర్) వేస్తున్న సమయంలో, నాలుగో బంతి వేసిన వెంటనే ఎడమ కాలి హామింగ్ నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడిన పతిరానాను ఫిజియోలు మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. ఆ ఓవర్లోని మిగిలిన రెండు బంతులను కెప్టెన్ దసున్ శనక పూర్తి చేయాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం..పతిరానా కనీసం 3 నుంచి 4 వారాల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల శ్రీలంక సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధించినప్పటికీ, పతిరానా అందుబాటులో ఉండకపోవచ్చు. అతని స్థానంలో దిల్షాన్ మధుశంక లేదా బినుర ఫెర్నాండో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా, పేసర్ ఇషాన్ మలింగ గాయాలతో దూరం కావడంతో శ్రీలంక బౌలింగ్ విభాగం బలహీనపడింది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పతిరానాను ఏకంగా రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట అయిన పతిరానాపై కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకుంది. కేకేఆర్ ఇప్పటికే ముస్తాఫిజూర్ రెహమాను విడుదల చేసింది. మరోవైపు భారత పేసర్ హర్షిత్ రాణా కూడా గాయంతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, పతిరానా గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతను ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి లేదా నగం సీజన్‌కు దూరమయ్యే ప్రమాదం ఉంది. అదే జరిగితే కేకేఆర్ వెచ్చించిన రూ.18 కోట్లు వృథా కావడమే కాకుండా, జట్టు బౌలింగ్ సమతూకం దెబ్బతింటుంది.