బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైతే ఎలా ఉంటుందో మాన్ మహారాజా రవితేజ మరోసారి నిరూపించారు. ఇటీవల విడుదలైన 'ఇరుముడి' చిత్రం ఘనవిజయం సాధించి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఈ చిత్రం తాజాగా రూ. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సైతం అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. సినిమా ఆరంభంలో బేబీ నక్షత్ర, రవితేజ, ప్రియా భవానీ శంకర్ పై చిత్రీకరించిన అన్‌సీన్ స్టిల్‌ను చిత్ర దర్శకుడు శివ నిర్వాణ పంచుకుంటూ సక్సెస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న రవితేజ, తన భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో వేగాన్ని పెంచడమే కాకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఎప్పుడూ రొటీన్ మాస్, కమర్షియల్ ఫార్ములాకే పరిమితం కాకుండా, కెరీర్లోనే మునుపెన్నడూ చేయని వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ సరికొత్త ప్రయాణంలో భాగంగా టాలీవుడ్లో లో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయతో రవితేజ చేతులు కలిపారు. 'సరిపోదా శనివారం' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వివేక్ ఆత్రేయ సిద్ధం చేసిన కథ రవితేజను అమితంగా ఆకట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రవితేజ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నడూ టచ్ చేయని 'హారర్ కామెడీ' జోనర్లోకి తొలిసారిగా అడుగుపెడుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా మాస్ యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్లతో పాటు పక్కా ఎంటర్టైనర్లలో రవితేజ తన మార్క్ చూపించారు. అయితే ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ తరహా పాత్రను ఆయన ఇంతవరకు చేయలేదు. వివేక్ ఆత్రేయ మార్క్ విలక్షణమైన స్క్రీన్‌ప్లే, రవితేజ అసమానమైన ఎనర్జీ, టైమింగ్ తోడైతే వెండితెరపై నవ్వుల విందు గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లక్ష్మణ్, శ్రీని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వివేక్ ఆత్రేయ చిత్రంతో పాటే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా రవితేజ ఖరారు చేశారు. 'రాజ రాజ చోర', 'స్వాగ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు హసిత్ గోలి దర్శకత్వంలో ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు మరో ప్రధాన పాత్రలో సందడి చేయనున్నారు. రవితేజ మార్క్ జోష్‌కు శ్రీవిష్ణు పంచ్ లు జతకలిస్తే వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. మొత్తానికి హసిత్ గోలి సినిమా పూర్తి కాగానే వివేక్ ఆత్రేయ హారర్ కామెడీ సెట్స్‌పైకి వెళ్లనుంది.