'పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..' అంటూ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సందడి చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు హిట్ టాక్ రావడంతో మొదటిరోజు వసూళ్లపై అందరిలోను ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ వివరాలను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలుచేసినట్లు వెల్లడించింది. 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ ను బద్దలు కొట్టేశారంటూ పోస్టర్ను పంచుకుంది. చిరంజీవి సరసన నయనతార నటించిన ఈ సినిమాలో వెంకటేశ్ అతిథి పాత్రలో సందడి చేశారు. కథేంటంటే..: శంకరవరప్రసాద్ (చిరంజీవి)నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) రక్షణ బాధ్యతల్ని చూస్తుంటాడు. మంత్రి కూడా శంకరవరప్రసాద్ ని తన కుటుంబసభ్యుడిలా చూస్తుంటాడు. భార్య శశిరేఖ (నయనతార) నుంచి వరప్రసాద్.. విడిపోయిన సంగతి తెలుసుకుని, ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు మంత్రి. పీఈటీగా ఆ స్కూల్లోకి అడుగుపెట్టిన శంకరవరప్రసాద్ తన పిల్లలకు చేరువయ్యాడా? అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు? వాళ్ల పెళ్లి ఎలా జరిగింది? ఊహ తెలియని వయ-సులోనే తండ్రికి దూరమైన పిల్లలకు శంకరవరప్రసాదే తమ తండ్రి అనే విషయం ఎప్పుడు తెలిసింది? కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ (వెంకటేశ్)కీ, శశిరేఖకీ సంబంధం ఏమిటి? విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకున్నారా, లేదా? తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.