పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా.. అనంతరం వాయుగుండంగా బలపడింది. ఈ క్రమంలో వాయవ్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్‌కు తూర్పు ఆగ్నేయంగా 150 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడి బాలాసోర్‌కు ఉత్తరాన తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. (జూలై ఐదో తేదీన ఉత్తర ఒడిశాకు ఆనుకుని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. మరల ఇరవై రోజుల తరువాత అదే ప్రాంతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది) అనంతరం వాయవ్యంగా ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ మధ్య నుంచి ఛత్తీస్ గఢ్ దిశగా పయనించనున్నదని అంచనావేస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీసగఢ్ లో భారీ నుంచి అతిభారీ, ఒకటి రెండుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి. ఉత్తరకోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, పోలవరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఈ నెల 29 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవుల అధికారులకు సమాచారం అందించారు. కాగా, రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. కావలి, జంగమహేశ్వరపురంలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.