టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కొత్త ఏడాది(2026) 5 రికార్డులు ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్.. కేవలం వన్డే ఫార్మాట్‌తో పాటు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో పాత కోహ్లిలా చెలరిగిన అతను.. సౌతాఫ్రికాపై రెండు శతకాలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో గతేడాదిని ఘనంగా ముగించాడు. అదే జోరును కొత్త ఏడాదిలోనూ కొనసాగిస్తే.. 5 రికార్డులను తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ ఏడాది మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026 సీజన్లో విరాట్ కోహ్లి 9 వేల పరుగుల మైలురాయి అందుకోనున్నాడు. ప్రస్తుతం అతను 259 ఇన్నింగ్స్ ల్లో 8661 పరుగులతో ఉన్నాడు. మరో 339 పరుగులు చేస్తే ఈ రికార్డ్ కోహ్లి వశం కానుంది. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు. అంతేకాకుండా ఒక్క ఫ్రాంచైజీ తరఫునే ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా నిలవనున్నాడు. గత మూడు సీజన్లలో 600 ప్లస్ రన్స్ చేసిన కోహ్లి.. ఈ రికార్డ్ నమోదు చేయడం పెద్ద కష్టమేం కాదు. కోహ్లి తర్వాత రోహిత్ శర్మ 267 ఇన్నింగ్స్‌లో 7046 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్లో 300 సిక్సర్ల మార్కును చేరుకోవడానికి కోహ్లి కేవలం 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో 9 సిక్సర్లు బాదితే.. కోహ్లి పేరిట ఈ రికార్డ్ నమోదు కానుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా కోహ్లి నిలవనున్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ(302) విరాట్ కోహ్లి కంటే ముందున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయికి విరాట్ కోహ్లి 443 వరుగుల దూరంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లి 296 ఇన్నింగ్స్ 14557 పరుగులు చేశాడు. మరో 443 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలు రాయి అందుకున్న ఆటగాడిగా కోహ్లి నిలుస్తాడు. ఓవరాల్‌గా రెండో ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్ 18426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సంగక్కర రికార్డ్‌ను బద్దలు కొట్టేందుకు కోహ్లి 42 పరుగుల దూరంలో నిలిచాడు. మరో 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లి నిలుస్తాడు. సంగక్కర మూడు ఫార్మాట్లలో కలిసి 28,016 పరుగులు చేయగా.. 623 ఇన్నింగ్స్ ల్లో కోహ్లి 27,976 రన్స్ చేశాడు. న్యూజీలాండ్ తో జరిగే అప్ కమింగ్ వన్డే సిరీస్‌లో ఈ రికార్డ్ బద్దలయ్యే అవకాశం ఉంది. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 150 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లి రికార్డ్ అందుకోనున్నాడు. ప్రస్తుతం కోహ్లి 145 అర్ధ శతకాలతో ఉన్నాడు. మరో 5 హాఫ్ సెంచరీలు బాదితే ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ 164 అగ్రస్థానంలో ఉన్నాడు. సెంచరీలను కలిపి లెక్కిస్తే కోహ్లి 229 సార్లు 500 రన్స్ చేయగా.. సచిన్ టెండూల్కర్ 264 సార్లు 50 ప్లస్ రన్స్ సాధించాడు.