నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఉదయం విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లి సోదాలు నిర్వహించింది. అనంతరం జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరుడు రామును కూడా అదుపులోకి తీసుకున్నారు.
జోగి రమేశ్ 2022లో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 మరియు 2019లో పెడన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, ప్రారంభంలో కాంగ్రెస్‌లో పని చేసి తరువాత వైఎస్సార్సీపీలో చేరారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో కూడా ఆయన పేరు రావడంతో అప్పట్లో విచారణ ఎదుర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి మంగళగిరి పోలీస్ స్టేషన్లో పలుమార్లు హాజరైన రమేశ్, అరెస్టు కాకుండా హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నకిలీ మద్యం కేసుపై సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్ధనరావు ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేశ్ పేరు రావడంతో, సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆయనను విజయవాడ తూర్పు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
ఈ క్రమంలో జోగి రమేశ్ అనుచరులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని “జోగి రమేశ్ నిర్దోషి” అంటూ నినాదాలు చేశారు. తాను ఈ నకిలీ మద్యం వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని గతంలోనే రమేశ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 27న విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించిన ఆయన, చేతిలో హారతి ఉంచుకొని “ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ ప్రమాణం చేశారు.
ఇదే కేసులో సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఇటీవల హైకోర్టుకు కూడా వెళ్లిన రమేశ్, తనపై రాజకీయ కక్షతో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
2024లో కూడా విజయవాడ సమీపంలోని అంపాపురం ప్రాంతంలో అగ్రిగోల్డ్ భూముల కుంభకోణం వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, అప్పట్లో సిఐడి అధికారులు ఆయన కుమారుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నకిలీ మద్యం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుండగా, మాజీ మంత్రి అరెస్ట్ రాజకీయంగా కలకలం రేపింది.