వంశధార నుంచి పెన్నా వరకూ నదులను అనుసంధానించాలి
పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుతో మేలు
కాళేశ్వరం కట్టినా మేం అభ్యంతరం చెప్పలేదు
గోదావరిలో వృధా జలాలు వినియోగంలోకి తెస్తాం
నదుల అనుసంధానంతో తెలుగుతల్లికి జలహారతి పడతా
తాగు, సాగు నీటి సరఫరా లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం
సాగునీటి రంగంపై శాసనసభలో సీఎం చంద్రబాబు
అమరావతి: పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోమారు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్లే వృథాగా వరద జలాలను.. ఆయా ప్రాజెక్ట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు. గోదావరిపై ఎగువన తెలంగాణ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందని, దీనికి తాము అభ్యంతరం చెప్పలేదని ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాలకూ దీని వల్ల లాభం కలుగుతుందని ఉద్ఘాటించారు. పోలవరం నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకి పొరుగు రాష్ట్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ప్రకృతిని ఆరాధించడం.. నీటిని పూజించే సంప్రదాయం మనదని సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరికి అఖండ హారతి ఇచ్చామని, కృష్ణాకు పవిత్ర హారతిఇచ్చామని గుర్తు చేస్తూ.. నదులను పూజించడం సంప్రదాయంగా పెట్టుకున్నామని తెలిపారు. సాగునీటి రంగంపై సీఎం చంద్రబాబు శాసనసభలో మాట్లాడారు. గంగా- కావేరి అనుసంధానం కావాలనేది నా ప్రగాఢ ఆకాంక్ష అని చెప్పారు. ఏ పనైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. గంగా-కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయి. నదుల అనుసంధానం చేసి తెలుగుతల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత మాది. నదుల అనుసంధానం వల్ల నీటి సమస్యలు తగ్గుతాయి. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఎన్డీయే లేదా తెదేపా హయాంలోనే జరిగాయి. పట్టిసీమ నుంచి 100 టీఎంసీలు కృష్ణాకు తీసుకొచ్చాం. వెలిగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా... నేనే పూర్తి చేస్తున్నా. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో కాటన్ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 2047 విజన్‌లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రధానంగా నీటి భద్రతపైనే దృష్టి సారించిందని సీఎం వ్యాఖ్యానించారు, గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత తమ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇవ్వడం ద్వారా జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని వివరించారు. వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది తన ప్రగాఢమైన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. గంగా - కావేరి అనునంధానం సాధ్యా సాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయని ప్రస్తావించారు. నదులు అనుసంధానం చేసి, తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువలను విస్తరించి కుప్పంలో వరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చామని వివరించారు. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చామన్నారు. ఎన్టీఆర్ ఆర్ హయాంలోనే రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రస్తావించారు. సాగునీటిపై 2014 నుంచి 2019లో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. గడిచిన 20 నెల లుగా రూ.20 వేల కోట్ల ఖర్చు చేయగలిగామని వివరించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకూ నీరిచ్చి, శ్రీశైలంలో నీటిని పొదువు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామని వెల్లడించారు. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురంతో సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మార్కాపురం, ఒంగోలు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. 30 ఏళ్ల ముందు ఆ ప్రాజెక్టు శంకుస్థావన చేసి.. మొదటి దశను ఈ ఏడాది జూలైలోనే పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2500 కోట్ల మేర ఇంకా ఖర్చు చేయాల్సి ఉందని వివరించారు. రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ క్రెడిట్ మొత్తం వైసీపీనే సీపీనే చోరీ చేస్తోందని ఆగ్రహించారు. వెలిగొందకు నీళ్లు రాకుండానే జగన్ రెడ్డి రిబ్బన్ కట్ చేశారని ఎద్దేవా చేశారు. కుప్పం లోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో పోశారని విమర్శించారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. రూ.2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. డయాఫ్రాం వాల్న గోదాట్లో కలిపేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఆ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నామని చెప్పుకొచ్చారు. పుష్కరాలకంటే ముందు ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మాటిచ్చారు. చింతలపూడి ఎత్తిపోతలను వూర్తి చేసి ఏలూరు, కృష్ణా జిల్లాలకు నీరు అందించేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 1312 టీఎంసీల నీటిని ఏపీ ప్రాజెక్టుల్లో నిల్వ చేసుకునే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 793 టీఎంసీల నీటితో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లూ కళకళలాడుతున్నాయి. మే 15 తేదీన నారుమళ్లకు నీరిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. 16 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ సాగుతో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉంది. నీటి నిర్వహణ నుంచి పొదుపు చేసే వరకూ నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా భూగర్భ జలాల పెంపునకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. భూగర్భజలాలు గణనీయంగా పెరగటంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ మోటార్ల ద్వారా వినియోగం కూడా తగ్గింది. తద్వారా రూ.91 కోట్ల మేర విద్యుత్ కూడా ఆదా అయ్యింది. ఏపీలో 50 శాతం గ్రీన్ కవర్ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒక్క తిరుమలలోనే 89 శాతం మేర పచ్చదనం ఉంది. గత పాలనలో గుండ్ల కమ్మ గేట్లు. కొట్టుకుపోతే గేట్లు పెట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వైసీపీ హయాంలో పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకుపోతే.. దాన్ని కూడా గుర్తించలేదు. జగన్ హయాంలో చేయని తప్పునకు నన్ను 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకూ నీరు ఇవ్వాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నాను. కావేరిపై రెండు రాష్ట్రాలు ఎలా కొట్టుకున్నాయో చూశాం. నీరుంటే ఎలాంటి సమస్యలూ రావు. నీటి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకొస్తున్నారు. ఏపీకి ఉండే వాటర్ సెక్యూరిటీ దక్షిణ భారత్‌లో మరే రాష్ట్రానికీ లేదు. భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాను. వ్యవసాయానికి, పరిశ్రమలకు నీరు ఇవ్వడంతో పాటూ ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తే లక్ష్యాన్ని సాధించినట్లే. తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రతి ఎకరాకూ నీరిచ్చే ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం.
రాష్ట్రంలో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేస్తున్నాం' అని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చేయని నేరానికి నన్ను గత పాలకులు.. 53 రోజలు పాటు జైల్లో పెట్టారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ నిరులు వ్వాలన్న లక్ష్యంతోనే పని చేస్తున్నా కావేరిపై రెండు రాష్ట్రాలు ఎలా కొట్లాడుకుంటున్నాయో చూశాం. నీరు పుష్కలంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావు. నీటి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యలను తీసుకొస్తున్నారు. ఏపీకి ఉండే వాటర్ సెక్యూరిటీ దక్షిణ భారత్‌లో మరే రాష్ట్రానికీ లేదు. భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని అందరికీ పిలుపునిస్తున్నా. సాగునీరు, పరిశ్రమలకు నీరు, ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తే లక్ష్యం సాధించినట్లే. తెలుగుతల్లికి జలహారతి ఇచ్చేలా ప్రతి ఎకరాకు నీరివ్వాలని సంకల్పం. రాష్ట్రంలో ప్రాజెక్టుల పూర్తికి బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నాం అని చంద్రబాబు వివరించారు.