టీ20 వరల్డ్ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. లీగ్ దశ ముగిసి సూపర్-8 సమరానికి తెరలేస్తున్న వేళ మైదానంలో ఆట కంటే ముందే మైండ్ గేమ్స్ మొదలయ్యాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ టీమిండియాపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కార్చిచ్చు రేపుతున్నాయి. టీమిండియా సెమీ ఫైనలు చేరే అవకాశమే లేదంటూ ఆయన చేసిన జోస్యంపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. లీగ్ దశలో టీమిండియా అజేయంగా నిలిచినప్పటికీ.. మహ్మద్ ఆమిర్ మాత్రం భారత బ్యాటింగ్ వైఫల్యాలనే ప్రధానంగా ప్రస్తావించారు. పాకిస్థాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో మినహా, మిగిలిన లీగ్ మ్యాచ్‌లో భారత టాపార్డర్ తడబడిందని ఆయన విమర్శించారు. అమెరికా, నమీబియా వంటి జట్లతో ఆడినప్పుడు కూడా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలిందని.. ఇలాంటి ప్రదర్శనతో బలమైన జట్లు ఉండే సూపర్-8లో నెగ్గుకురావడం అసాధ్యమని ఆమిర్ అభిప్రాయపడ్డారు. "భారత్ సెమీస్ చేరదు.. ఇది రాసి పెట్టుకోండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కనుతో కూడినవిగా కనిపిస్తున్నాయి. మహ్మద్ ఆమిర్ తన విశ్లేషణలో టీమిండియాను పక్కన పెట్టి, ఇతర జట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏ జట్టునైనా ఓడించే సత్తా ఈ రెండు జట్లకు ఉందని, గ్రూప్-1 నుంచి ఇవే సెమీస్ కు వెళ్తాయని జోస్యం చెప్పారు. 2024 డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ కంటే, ఈ జట్లే నిలకడగా ఉన్నాయని అమీర్ వాదించడం గమనార్హం. భారత్ తన సూపర్-8 ప్రయాణంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంది. మరోవైపు పాకిస్థాన్ తన గ్రూపులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి జట్లతో తలపడనుంది. లీగ్ దశలో పాక్‌పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా, మహ్మద్ ఆమిర్ కామెంట్స్‌ను పక్కన పెట్టి మైదానంలో సమాధానం చెప్పాలని కసిగా ఉంది. మహ్మద్ ఆమిర్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. "ముందు మీ జట్టు సంగతి చూసుకోండి" అంటూ ఎద్దేవా చేస్తున్నారు. 2024 వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోందని, పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ కేవలం అసూయతోనే ఇలా మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌ను తక్కువ అంచనా వేయడం అమీర్ అవివేకమని ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.