టీ20 ప్రపంచ కప్ 2026 లో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్ దగ్గర పడుతోంది. కొన్ని రోజుల కిందటి వరకు భారత్, పాకిస్తాన్ లీగ్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అంతా టెన్షన్ పడ్డారు. కానీ పాక్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాక్ జట్టు భారత్ తో మ్యాచ్ ఆడేందుకే చెప్పింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇది గ్రూప్-ఎ లో జరుగుతున్న లీగ్ మ్యాచ్, కానీ ఫైనల్ మ్యాచ్ కంటే దాయాది జట్ల పోరు తక్కువ కాదు. ఈసారి టీ20 ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంక నిర్వహిస్తున్నాయి. భద్రత, రాజకీయ కారణాల వల్ల పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. ఈ పరిస్థితిలో, భారత జట్టు తన మొదటి రెండు మ్యాచ్‌లను భారత్ వేదికగా ఆడింది. కానీ పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియా జట్టు శ్రీలంకకు వెళుతుంది. రెండు మ్యాచ్ లలో నెగ్గిన భారత్ ఆదివారం తమ మూడో మ్యాచులో పాక్‌తో తలపడుతుంది. ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తోంది. గెలిచిన రెండు మ్యాచ్‌లలో జట్టు కొన్ని లోపాలు కనిపించినా, తక్కువ సమయంలోనే వాటిని అధిగమించి ప్రత్యర్థి జట్లపై విజయాలు సాధించింది. బ్యాటింగ్‌లో దూకుడు, బౌలింగ్ అటాక్‌తో భారత్‌కు విజయాలు వస్తున్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు కప్పును నిలబెట్టుకునేలా కనిపిస్తోంది. ఫాస్ట్ బౌ లింగ్లో జస్పీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ప్రభావం చూపుతారు. మరోవైపు పాకిస్తాన్ జట్టు కూడా కప్పు కొట్టాలని భావిస్తోంది. పాక్ జట్టు కూడా టోర్నీలో 2 మ్యాచ్‌లు గెలిచింది. కొత్త నాయకత్వంలో జట్టు సంయమనం, దూకుడు మధ్య బ్యాలెన్స్ చూపించింది. షాహీన్ అఫ్రిది, నసీమ్ షా ఫాస్ట్ బౌలింగ్ ప్రత్యర్థి జట్టుకు ఛాలెంజ్ వినురుతాయి. దాంతో ఆదివారం జరగనున్న భారత్, పాక్ మ్యాచ్ పై ఆసక్తి పెరుగుతోంది. కొలంబో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలం. కనుక మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ల పాత్ర చాలా ముఖ్యం. ఒత్తిడిని తట్టుకుని మిడిల్ ఓవర్లు ఆడిన జట్టు విజయం సాధించవచ్చు. ప్రపంచ కప్‌లో భారత్ పైచేయి సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, పాకిస్తాన్ కూడా అంచనాలు లేకుండా బరిలోకి దిగి సంచనాలు చేస్తుందని తెలిసిందే. గ్రూప్ స్టేజీ నుంచి సూపర్ 8కు వెళ్లే జట్లు కూడా ఇవే. అయితే ఆ మ్యాచ్ నెగ్గిన టీం దాదాపుగా సూపర్-8 బెర్త్ కన్పామ్ చేసుకుంటుంది. భారత్, పాక్ జట్లు ఫిబ్రవరి 15న తలపడతాయి. టాస్ సాయంత్రం 6:30 గంటలకు వేయనుండగా, రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మెగా మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్ స్టార్‌లో లైవ్ చూడవచ్చు.