మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచన
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 లో టీమిండియా విజేతగా నిలవాలంటే రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నాడు. అసలు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.38 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలిచింది. దాంతో టీమ్‌మేనేజ్‌మెంట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరాజయం నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాల్సిన అవసరం ఏం ఉంది? ఇప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగి ఉంటే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో ఫలితం మరోలా ఉండేది. ఎందుకంటే రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు జట్టు సరైన దిశలో నడుస్తుందని నేను భావించాను. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. రోహిత్ శర్మకు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి. వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో బీసీసీఐ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాలి. ఇది ప్రపంచకప్‌కు సంబంధించిన విషయం. ఏదో ఒక ద్వైపాక్షిక సిరీస్ లేదా సాధారణ టోర్నీ గురించి మనం మాట్లాడటం లేదు. దేశం గర్వించే మెగా టోర్నీ కోసం అనుభవం కలిగిన సారథి అవసరం. రోహిత్ శర్మకు అపారమైన అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్‌గా అనుభవం లేదు. రోహిత్ అతని కంటే చాలా ముందున్నాడు. అనుభవం కలిగిన కెప్టెనా? కాదా? అనేది వారి ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు, ఏ బౌలర్ తో ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేయిస్తున్నారు? అనే విషయాలతో తెలిసిపోతుంది. హిత్ శర్మ.. శుభ్‌మన్ గిల్ కంటే ఎంతో గొప్ప సారథి. అందుకే హిట్ మ్యాన్ సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో కూడా భారత్ ప్రపంచకప్ గెలవవచ్చు. కానీ రోహిత్ పోల్చినప్పుడు అతను అనుభవం లేని కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు. గిల్ కెప్టెన్సీలో కంటే రోహిత్ సారథ్యంలో టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 'అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.