భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిగా నిలిచిన ఎల్విఎం3–ఎం6 (బాహుబలి) రాకెట్ ప్రయోగం బుధవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విజయవంతంగా జరిగింది. ఉదయం 8.54 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన ఈ రాకెట్, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘బ్లూబర్డ్ బ్లాక్–2’ను కేవలం 15 నిమిషాల్లోనే నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చింది.
మూడు దశల్లో సాగిన ఈ ప్రయోగం పూర్తి విజయవంతం కావడంతో షార్ కేంద్రం సంబరాలతో నిండిపోయింది. సుమారు 6,100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్–2, ఇస్రో ఇప్పటివరకు ప్రయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) ఈ ప్రయోగాన్ని నిర్వహించడం విశేషం.
కమ్యూనికేషన్ రంగానికి కొత్త దిశ
బ్లూబర్డ్ బ్లాక్–2 ఉపగ్రహం ద్వారా ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలో పెద్ద మార్పులు రానున్నాయి. సాధారణ స్మార్ట్ఫోన్లకే నేరుగా అంతరిక్షం నుంచి 4జీ, 5జీ సిగ్నల్స్ అందించే సాంకేతికత దీనిలో ఉంది. దీంతో మొబైల్ టవర్స్ లేని మారుమూల ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, విపత్తుల సమయంలోనూ కమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లో ప్రయోగించిన అత్యంత భారీ వాణిజ్య ఉపగ్రహంగా దీనికి గుర్తింపు లభించింది. ఉపగ్రహంలోని భారీ యాంటెన్నా పూర్తిగా విస్తరించిన తర్వాత సుమారు 223 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. ఈ విజయం అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో భారత్ స్థాయిని మరింత పెంచింది.
శాస్త్రవేత్తలకు అభినందనలు
ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ శాస్త్రవేత్తలను అభినందించారు. అహర్నిశలు శ్రమించిన ప్రతి బృందసభ్యుడికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారత రాకెట్ సాంకేతికతపై ప్రపంచానికి మరోసారి నమ్మకం పెరిగిందని అన్నారు.
ఇస్రో భవిష్యత్ లక్ష్యాలు
ఇస్రో రాబోయే రోజుల్లో చేపట్టనున్న ప్రణాళికలపై చైర్మన్ వివరించారు.
-
గగన్‌యాన్ అన్‌క్రూడ్ మిషన్ల కొనసాగింపు
-
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వి)ను పూర్తి స్థాయిలో ఆపరేషనల్ చేయడం
-
స్టార్టప్ సంస్థలతో కలిసి కొత్త ప్రయోగ వాహనాల అభివృద్ధి
-
దేశ అవసరాలకు కీలకమైన నావిగేషన్ ఉపగ్రహాల ప్రయోగాలు
-
చంద్రయాన్–4, చంద్రయాన్–5, అలాగే శుక్రగ్రహ (వీనస్) మిషన్‌కు కేంద్ర అనుమతులు
ఈ విజయంతో మరోసారి అంతరిక్షంలో భారత్ సత్తా చాటిన ఇస్రోకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.