భారత నౌకాదళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. 150కి పైగా యుద్ధనౌకలు, సబ్మెరైన్లను కలిగి ఉన్న భారత నేవీలో ఇప్పటివరకు ఏ నౌకలోనూ మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతులు లేవు. అయితే, ఇప్పుడు ఆ పరంపరను చెరిపేసి, మహిళా శక్తికి గౌరవ సూచకంగా నిలిచేలా రూపొందించబడిన ‘సంధాయక్ క్లాస్ సర్వే వెసల్’ ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకను జాతికి అంకితం చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇక్షక్ నౌక మహిళా అధికారిణులు, సిబ్బందికి ప్రత్యేకంగా రూపొందించిన వసతులతో కూడిన తొలి నేవల్ వెసల్‌గా చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు మహిళా సిబ్బంది పురుష సహచరులతో సమాంతరంగా పనిచేస్తూ, ఒకేలాంటి గదులను వినియోగించుకునేవారు. కానీ ఇక్షక్‌లో మాత్రం మహిళల కోసం ప్రత్యేక కంపార్ట్మెంట్లు, సౌకర్యాలు,, అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి. ఇది భారత నౌకాదళంలో జెండర్ ఇన్‌క్లూజన్ దిశగా తీసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ఆత్మనిర్భర్ భారత్‌లో మరో మైలురాయిగా పేర్కొనదగిన ఇక్షక్.. 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ ఈ నౌకను తయారు చేసింది. ఈ నౌక నిర్మాణాన్ని డైరెక్టరేట్ ఆఫ్ షిప్ ప్రొడక్షన్ మరియు వార్‌షిప్ ఓవర్‌సీయింగ్ టీమ్ పర్యవేక్షించాయి.
భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కొచ్చి నావల్ బేస్‌లో ఈ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.
ఇక్షక్ ప్రారంభం ఆత్మనిర్భర్ భారత్ దిశలో భారత నౌకాదళం వేసిన మరో ఘన అడుగుగా పరిగణించబడుతోంది. స్వదేశీ పరిజ్ఞానం, ఆధునిక టెక్నాలజీ, మహిళా శక్తి సమ్మిళితంగా ఉన్న ఈ నౌక దేశ సముద్ర రక్షణలో నూతన శక్తిని చేకూర్చనుంది.
ఇంతకీ ఇక్షక్ అంటే ఏమిటని ఆరా తీస్తే.. “ఇక్షక్” అనే పదానికి అర్థం “దిక్సూచీ” లేదా “ది గైడ్”. ఇది మార్గదర్శకుడి ప్రతీక. ఈ నౌక సముద్ర గర్భంలోని తెలియని ప్రాంతాలను అన్వేషిస్తూ, నావిగేషన్ మార్గాలను సూచిస్తూ, భారత సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయనుంది.
ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే, ఓషనోగ్రాఫిక్ డేటా సేకరణ, తీర రక్షణ, ఎకనామిక్ ఎక్స్‌క్లూజివ్ జోన్ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించనుంది. అంతేకాక, అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ షిప్‌గా కూడా ఉపయోగించవచ్చు. ప్రకృతి విపత్తులు లేదా రక్షణ చర్యల సమయంలో మానవతా సేవలు అందించడానికి ఇది సిద్ధంగా ఉంటుంది.
సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ చరిత్ర
1968లో మొదటి సంధాయక్ సర్వే వెసల్ భారత నౌకాదళంలో చేరింది. 2021 వరకు సేవలందించిన తర్వాత అది రిటైర్ అయింది. రక్షణ మంత్రిత్వ శాఖ 2017లో నాలుగు కొత్త సంధాయక్ క్లాస్ సర్వే వెసల్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 2,435.15 కోట్ల వ్యయంతో ఈ కాంట్రాక్ట్ GRSE సంస్థకు దక్కింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటివరకు మూడు నౌకలు నిర్మించబడ్డాయి.
వాటిలో మొదటిది జే–18 ఐఎన్ఎస్ సంధాయక్.. 75% స్వదేశీ సాంకేతికతతో రూపొందగా, జే–19 ఐఎన్ఎస్ నిర్దేశికన్, జే–23 ఐఎన్ఎస్ ఇక్షక్.. 80% స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. 2026 నాటికి ఐఎన్ఎస్ సంశోధక్ భారత నౌకాదళంలో చేరనుంది.
అనేక ప్రత్యేకతలతో తీర్చిదిద్దబడిన ఐఎన్ఎస్ ఇక్షక్.. అత్యాధునిక సాంకేతిక సంపత్తి, మెరుగైన సామర్థ్యం, తదుపరి తరం ఆయుధ సామగ్రితో పహారా కాస్తుంది.
ఇక్షక్ నౌక పొడవు 110 మీటర్లు, బరువు 3,400 టన్నులు, గరిష్ట వేగం గంటకు 33 కిలోమీటర్లు. ఇది ఏకధాటిగా 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఒకసారి సముద్రంలో బయలుదేరిన తర్వాత 25 రోజులపాటు నిరంతరాయంగా పహారా నిర్వహించగలదు.
ఇందులో మొత్తం 231 మంది సిబ్బంది పని చేస్తారు. ఇది ఆధునిక సీఆర్ఎన్–91 నేవల్ గన్, హాల్ ధ్రువ్ ఎంకే–3 హెలికాప్టర్ సౌకర్యాలతో రూపొందింది.
అదనంగా,
* అటానమస్ అండర్‌వాటర్ వెహికల్ సెన్సార్లు,
* హైడ్రోగ్రాఫిక్ సెన్సార్లు,
* సైడ్ స్కాన్ సోనార్,
* రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్,
* మెరైన్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఇక్షక్కి సముద్ర రక్షణలో అపూర్వ సామర్థ్యం కల్పిస్తున్నాయి.
ఇక్షక్ నౌక రూపకల్పన భారత నౌకాదళం మారుతున్న విలువలకు ప్రతిబింబం. మహిళా సిబ్బందికి సమాన అవకాశాలు, గౌరవం కల్పించడం ద్వారా ఇది “ఇన్‌క్లూజివ్ నేవీ” దిశగా నడుస్తున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
భవిష్యత్తులో ప్రతి నౌకలో మహిళా సిబ్బందికి ప్రత్యేక సౌకర్యాలు ఉండే విధంగా ఇది దారితీసే మార్గదర్శక నమూనాగా నిలవనుంది.
భారత సముద్ర రక్షణ చరిత్రలో ఐఎన్ఎస్ ఇక్షక్ ఒక మైలురాయి. ఇది కేవలం ఒక సర్వే నౌక మాత్రమే కాదు.. మహిళా గౌరవం.. ఆత్మనిర్భర్ భారత్ ప్రతిరూపం.
ఇది భారత నౌకాదళ భవిష్యత్తుకు కొత్త దిశను చూపుతూ, “ఇక్షక్” అనే తన పేరుకి తగినట్టుగా దేశ సముద్ర శక్తికి దిక్సూచీగా నిలిచిపోనుంది.