భారతదేశం తొలి మహిళా ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన షెఫాలి వర్మ, ఐసిసి మహిళా క్రీడాకారిణి ఆఫ్ ది మంత్ గా ఎంపికైంది. నవీ ముంబైలో జరిగిన ఫైనల్లో, దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో, ఆమె 78 బంతుల్లో 87 పరుగులు చేసింది. మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో ఒక భారత ఓపెనర్ చేసిన అత్యధిక స్కోరు ఇది. అంతేకాకుండా, షఫాలీ బ్యాటింగ్ తో పాటు బంతితో కూడా తన వంతు పాత్ర పోషించింది, రెండు వికెట్లు కూడా తీసింది. ఆమె ఆల్ రౌండ్ ప్రదర్శనతో, భారతదేశం 7 వికెట్లకు 298 పరుగుల బలమైన స్కోరును నమోదు చేసింది. ఆ తర్వాత మ్యాచ్ ను 52 పరుగుల తేడాతో గెలిచి మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో, ఈ గౌరవం దక్షిణాఫ్రికా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ సైమన్ హార్మర్‌కు దక్కింది. ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో హార్మర్ 17 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
ప్రతికా రావల్ స్థానంలో షెఫాలీ జట్టులోకి వచ్చింది. మొదటి ప్రపంచ కప్‌కు ఎంపికైన భారత జట్టులో ఆమె భాగం కాలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీకా రావల్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడిన తర్వాత ఆమెను జట్టులోకి తీసుకున్నారు. 21 ఏళ్ల షెఫాలీ ఫైనల్లో స్మృతి మంధానతో కలిసి మొదటి వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారతదేశం చారిత్రాత్మక విజయానికి పునాది వేసింది. ఈ అవార్డు కోసం షెఫాలీ థాయిలాండ్‌కు చెందిన తిపాచా పుట్టావాంగ్, యుఎఇకి చెందిన ఇషా ఓఝాను వెనక్కి నెట్టింది.
"ఇది గొప్ప ముగింపు," అని అవార్డు అందుకున్న తర్వాత షెఫాలి అన్నారు. తన మొదటి ప్రపంచ కప్ అనుభవం ఊహించినంతగా లేదని, కానీ ముగింపు తాను ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. ఆమె ఈ గౌరవాన్ని తన జట్టు, కోచ్‌లు, కుటుంబం, తన మద్దతుదారులందరికీ అంకితం చేసింది.సైమన్ హార్మర్ పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో హార్మర్ అద్భుతమైన ప్రదర్శనతో 8.94 సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ దక్షిణాఫ్రికా 2-0 క్లీన్ స్వీప్‌ను పూర్తి చేయడంలో సహాయపడింది, 25 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వారి మొదటి టెస్ట్ సిరీస్ విజయం ఇది కావడం గమనార్హం గమనార్హం.