ఐటీ సోదాలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!
తన పేరును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ సోదాలతో ముడిపెడుతూ వస్తున్న వార్తలపై బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ సోదాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు, ఆన్లైన్ రిపోర్టర్లు వార్తలను సంచలనం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "కొందరు ఆన్లైన్ రిపోర్టర్లు, కొన్ని ప్రధాన మీడియా సంస్థల్లో వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సంచలనం చేసే ధోరణి పెరుగుతుండటం బాధాకరం, అందుకే ఒకేసారి అందరికీ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సోదాలు నాకు సంబంధించినవి కావు" అని రకుల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. తన నేపథ్యం గురించి వివరిస్తూ.. "నేను ఆర్మీ కుటుంబం నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి గాఢ్ఫాదర్ లేరు. కేవలం నా కష్టంతోనే ఈ స్థాయికి వచ్చాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నాను" అని ఆమె తెలిపారు. ఆర్థిక అవకతవకల ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. "వ్యక్తిగతంగా గానీ, ఏ నిర్మాణ సంస్థ తరఫున గానీ నేను ఎలాంటి అక్రమ విదేశీ లావాదేవీలలో పాలుపంచుకోలేడు. దేశంలో లేదా విదేశాల్లో ఎవరి పేరు మీద కూడా నేను బినామీ ఆస్తులు కలిగి లేను, నాకు ఎవరూ ఎప్పుడూ ఎలాంటి ఆస్తులను బహుమతిగా ఇవ్వలేదు. అలాంటి ఖరీదైన బహుమతులు తీసుకోకూడదన్నది నా నియమం" అని రకుల్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. "నా గురించి తప్పుడు, దురుద్దేశపూర్వక కథనాలు ప్రచురించిన వారందరూ వాటిని వెనక్కి తీసుకుని, వాస్తవాలను స్పష్టం చేయాలని కోరుతున్నాను మీడియా వ్యాపారంలో ఎంత పెద్ద సంస్థకైనా ఆర్థిక ఒత్తిళ్లు ఉ ంటాయని నేను అర్ధం చేసుకోగలను. కానీ అది వాస్తవాలను పణంగా పెట్టి జరగకూడదు. ఒకరి ప్రతిష్ట, జీవనోపాధిని దెబ్బతీసేలా అసలే ఉండకూడదు" అని ఆమె హితవు పలికారు.