తెలంగాణ రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే ప్రాజెక్టుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు నిలవనుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక నగరాన్ని చుట్టూ పూర్తిస్థాయిలో రైల్వే రింగ్ ప్రాజెక్టును తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇప్పటికే తుది స్థాయిలో ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఆరు రైలు మార్గాలతో అనుసంధానం
ఈ ప్రాజెక్టు ద్వారా సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌తో పాటు ముంబయి, వరంగల్, గుంటూరు వంటి ఆరు ప్రధాన రైలు మార్గాలకు అనుసంధానం ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే మూడు విభిన్న ఎలైన్మెంట్లను ప్రతిపాదించగా, వాటిలో ఒకదానిని త్వరలో ఖరారు చేయనున్నారు.
జిల్లాలకు మెరుగైన కనెక్టివిటీ
ఈ రింగ్ రైలు మార్గం హైదరాబాద్‌ను చుట్టూ ఎనిమిది నుంచి 10 జిల్లాలను తాకుతూ వెళుతుంది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట జిల్లాలు ప్రాజెక్టులో భాగం. ఆప్షన్-2లో అదనంగా జనగామ, కామారెడ్డి జిల్లాల పేర్లు ఉన్నాయి. ఇది జిల్లాల మధ్య రైలు రాకపోకలను సులభతరం చేయడం ద్వారా ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
గూడ్స్ రైళ్లకు ప్రత్యామ్నాయ దారి
ఈ ప్రాజెక్టు ద్వారా వాణిజ్య రవాణా (గూడ్స్ ట్రైన్లు) గమ్యస్థానాలకు వెళ్లే మార్గంలో మళ్లింపునకు అవకాశం లభిస్తుంది. ఇది సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే, రోడ్డు రవాణాలో ఔటర్ రింగ్ రోడ్ ఎలా పని చేస్తుందో, ఇప్పుడు అదే విధంగా రైల్వేలో కూడా ఒక పరిష్కార మార్గం అందుబాటులోకి రానుంది.
ప్రాజెక్టు ప్రయోజనాలు
- ప్రధాన నగరానికి వెళ్లకుండా వేర్వేరు దిశల నుంచి వచ్చే రైళ్లను బయట నుంచే మళ్లించే అవకాశం.
- కొత్తగా రైల్వే స్టేషన్స్ వచ్చే అవకాశం ఏర్పడి పల్లె ప్రాంతాలకూ మెరుగైన కనెక్టివిటీ.
- ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు నగర రద్దీ తగ్గింపు.
- దూర ప్రాంత ప్రయాణాలకు మెరుగైన మార్గాలు అందుబాటులోకి రావడం.
భవిష్యత్తు దృష్టిలో వినూత్న ఆలోచన
ఇప్పటి వరకు బెంగళూరు, ముంబయి, చెన్నై వంటి మెట్రో నగరాల్లో రైల్వే టెర్మినళ్లు మాత్రమే ఉన్నప్పటికీ, ఔటర్ రింగ్ రైలు రూపంలో పూర్తి రింగ్ లూప్ ప్రాజెక్టు చేపట్టిన నగరం హైదరాబాద్ మాత్రమే. ఇది తెలంగాణ అభివృద్ధికి మైలురాయి కావడంలో సందేహం లేదు.