ఉప్పొంగుతున్న మూడు ప్రధాన నదులు
ఖాట్మాండ్ నేపాల్‌కు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మూడు ప్రధాన నదులలో నీటి మట్టాలు డేంజర్ మార్క్ న్ను దాటాయి. నేపాల్ వరద అంచనా విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో నున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదులలో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. లాంగ్ జిల్లాలోని మార్శ్యాంగ్రి నదిలో కూడా నీటి మట్టం మంగళవారం అర్ధరాత్రి డేంజర్ మార్క్ దాటిందని అధికారులు వెల్లడించారు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ సూచించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరంతరం వర్షాలు కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బుధవారం నాటికి నేపాల్, టిబెట్లలో కలిపి మరణాల సంఖ్య 1,1808 పెరిగింది. ఇప్పటి వరకు 1,113 మృతదేహాలకు పోస్ట్‌మార్టం.. చట్టపరమైన గుర్తింపు పక్రియలు వూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. 95 మృతదేహాలను బంధువులకు అప్పగించామన్నారు. గుర్తింపులేని 911 మృతదేహాల వివరాలను వెబ్సైట్ లో అప్లోడ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 6,541 మందిని రక్షించగా..4,858 మంది గల్లంతయ్యారు. 7,912 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.