బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్, ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో తింటూ, పొరుగు దేశం కోసం పోరాడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖుల మౌనం గురించి గతంలో నసీరుద్దీన్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం మరోసారి రాజుకుంది. ఇటీవల నటుడు పియూష్ మిశ్రా, నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను ప్రస్తావించిన ఓ వార్తను కంగనా తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా నసీరుద్దీన్ ను ఉద్దేశిస్తూ.. "నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి కుక్కలే. కానీ, నేను ఏ ఇంటి (దేశం) రొట్టె తింటున్నానో, ఆ ఇంటికి కాపలా కాస్తున్నందుకు, దాని కోసం పోరాడుతున్నందుకు గర్వపడుతున్నాను. నసీర్ సాబ్ ఈ దేశపు తిండి తింటారు. కానీ, పొరుగు దేశం కోసం పోరాడతారు" అని కంగనా రాసుకొచ్చారు. ఆయన్ను ఓ 'నక్క' (లోమీ) అని అభివర్ణించిన కంగనా, తాను మాత్రం విశ్వాసపాత్రమైన కుక్కగా ఉండటానికే ఇష్టపడతానని స్పష్టం చేశారు. గతంలో విద్యార్థుల నిరసనలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించినప్పుడు నసీరుద్దీన్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "నోట్లో ఎముక ఉన్న కుక్క మొరగదు. ఆ ఎముక కిందపడగానే లేదా పళ్లు విరగ్గొట్టగానే అప్పుడు మొరుగుతుంది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు మద్దతుగా పియూష్ మిశ్రా మాట్లాడుతూ, షా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఇప్పుడు ఏ 'కుక్కలు' మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు. ఈ వార్తను షేర్ చేస్తూనే కంగనా నసీరుద్దీన్ పై విరుచుకుపడ్డారు.గతంలో కూడా కంగనా విద్యార్థుల ఉద్యమాలను విమర్శిస్తూ, యువతలో ఒక వర్గాన్ని 'గట్టర్ చాప్' అని సంబోధించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.