జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన
ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు
ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్లెర్ లేయెన్
దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్‌లో పాల్గొంది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాల కవాతు ప్రారంభమైంది. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్వికదళం తొలిసారి ఈ పరేడ్‌లో పాల్గొంది. ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థలు వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వానౌర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతి సీపీ రా రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది విచ్చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన పరేడ్ భారత సైనిక శక్తి పాటవాన్ని నగర్వంగా చాటిచెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో వాడిన పలు ఆయుధ వ్యవస్థలను సైనిక దళాలు కర్తవ్యపథ్ వేదికగా అచ్చెరువొందేలా ప్రదర్శించాయి. ఈ కవాతులో తొలిసారిగా బ్యాటిల్ అరే ఫార్మేషన్లో నిర్వహించిన కవాతు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యుద్ధ క్షేత్రంలో సైన్యాల మోహరింపును పోలినట్టు పరేడ్ నిర్వహించడం అతిథులు ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ పరేడ్‌లో త్రివిధ దళాలకు చెందిన 6,050 సైనికులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ థీమ్‌తో సాగిన ఆయుధ ప్రదర్శన భారత సైనిక పాటవాన్ని జగద్విదితం చేసింది. ఈ వేడుకల సందర్భంగా నాలుగు ఎమ్ఐ-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకగా నిలిచిన ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, బ్రహ్మోస్ క్షిపణి ప్రదర్శన, 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ అతిథులను ఆకట్టుకున్నాయి. అర్జున్ యుద్ధ ట్యాంకు ప్రదర్శన కూడా ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది. భారత్‌కు అత్యంత కీలకంగా మారిన ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా ప్రదర్శించారు. అపాచీ, ప్రచండ్ హెలికాప్టర్లు, వివిధ యుద్ధ విమానాల గగనతల విన్యాసాలు మెప్పించాయి. డ్రోన్ ప్రదర్శన కూడా పరేడ్‌లో జనాలను అమితంగా ఆకట్టుకుంది. ఈ కవాతులో కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్ కూడా మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సైనిక కవాతుతో పాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలు, కళా ప్రదర్శనలు దేశ సాంస్కృతిక వైవిధ్యతను చాటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన 30 శకటాలు దేశ ఖ్యాతిని ఇనుడింపచేశాయి. ఈ వేడుకల్లో దేశం నలుమూలల నుంచి సుమారు 10 వేల మంది అతిథులు పరేడ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు.