మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రానికి భారీ నష్టం సంభవించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను సమర్పించింది. ఇప్పటివరకు లభించిన అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు చెందిన నష్టం మొత్తం రూ.5,244 కోట్లుగా నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఇవి ప్రాథమిక అంచనాలేనని, పూర్తి వివరాలు అందిన తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కూడా విజ్ఞప్తి చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మొంథా తుపాన్ నష్టంపై రూపొందించిన నివేదికను పంపారు. ఆర్టీజీఎస్ ద్వారా తుపాన్ ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్న తీరును వివరించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని నివేదిక వెల్లడించింది. మొత్తం 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలు తుపాన్ ప్రభావానికి లోనయ్యాయి. 161 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తుపాన్ వల్ల సంభవించిన నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.
తుఫాన్ తీవ్రతను చూపించే ఫొటోలు నివేదికకు జతచేయబడ్డాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
### రహదారులు, వ్యవసాయం రంగాల్లో భారీ నష్టం
ప్రాథమిక నివేదిక ప్రకారం అత్యధిక నష్టం రహదారులు మరియు వ్యవసాయ రంగాల్లో జరిగింది. మొత్తం 4,794 కి.మీ. మేర ఆర్అండ్బీ రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ నష్టం రూ.2,774 కోట్లుగా అంచనా వేసింది. అదేవిధంగా, 18 జిల్లాల్లోని 862 కి.మీ. మేర పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. ఈ శాఖకు రూ.454 కోట్ల నష్టం సంభవించింది. 48 పట్టణాల్లో రోడ్లు, భవనాలు మరియు ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. వీటి పునరుద్ధరణకు రూ.109 కోట్లు అవసరమని నివేదిక తెలిపింది.
### వ్యవసాయరంగంలో 1.74 లక్షల మంది రైతులపై ప్రభావం
వ్యవసాయరంగంలో 1.38 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. దాంతో 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి నష్టమై రూ.829 కోట్ల మేర నష్టం జరిగింది. ఈ ప్రభావం 1.74 లక్షల మంది రైతులను తాకింది. ఉద్యానపంటల విషయంలో 12,215 హెక్టార్లలో రూ.40 కోట్ల విలువైన పంటలు నాశనం అయ్యాయి. మొత్తం 23,979 మంది ఉద్యాన రైతులు నష్టపోయారు. ఆక్వారంగంలో 32 వేల ఎకరాల్లో రూ.514 కోట్ల విలువైన ఉత్పత్తి కోల్పోయారు. అదనంగా, 2,261 ఎకరాల్లో పశు సంపదకు నష్టం వాటిల్లింది.
### విద్యుత్, గృహ, మౌలిక వసతుల నష్టం
రాష్ట్రవ్యాప్తంగా 2,817 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 26,575 డీటీఆర్లు దెబ్బతిన్నాయి. 429 కి.మీ. మేర విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీని వల్ల విద్యుత్ శాఖకు రూ.19 కోట్ల నష్టం జరిగింది. నీటిపారుదల శాఖకు రూ.234 కోట్ల మేర నష్టం తలెత్తింది.
మొత్తం 23 జిల్లాల పరిధిలో 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అంగన్వాడీలు, పాఠశాలలు, సీహెచ్సీలు, పీహెచ్సీలు, చేనేత మగ్గాలు తదితర మౌలిక వసతులకు రూ.122 కోట్ల నష్టం వాటిల్లింది.
ప్రభుత్వం మొత్తం 1,464 చోట్ల రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి 1,36,907 మందికి పునరావాసం కల్పించింది. ఇప్పటివరకు సహాయక చర్యల కోసం దాదాపు రూ.32 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారులు నివేదికలో తెలిపారు.