ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు మొదలయ్యాయి. దేవాదాయ శాఖ నేతృత్వంలో 2027 జూన్ 26 నుండి జులై 7 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేశారు. ఈసారి పుష్కరాలకు 7 నుండి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపించారు అధికారులు. దీంతో భారీ బడ్జెట్ ప్రతిపాదనలతో అన్ని శాఖలు సమన్వయంగా పని చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది ప్రభుత్వం. తూర్పు గోదావరి జిల్లాలో ఘాట్ల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, రవాణా–పర్యాటక సదుపాయాల కోసం వేల కోట్ల రూపాయల అంచనాలు సిద్ధం అవుతున్నాయి.
పుష్కరాల ప్రాముఖ్యం, ముహూర్తం
భారతదేశంలో పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు రావడం విశేషం గా భావిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలను మహోత్సవాల్లా నిర్వహిస్తూ కోట్లాది భక్తులను ఆకర్షిస్తారు. 2015లో గోదావరి మహా పుష్కరాలు జూలై 14 నుంచి 25 వరకు జరిగాయి. అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత సమగ్రంగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దేవాదాయ శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఆగమ, వైదిక పండితులు, టీటీడీ సిద్ధాంతి సహా 16 మంది నిపుణులు పాల్గొని పుష్కరాల తేదీలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలు, మౌలిక వసతులు
గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం తూర్పు గోదావరి జిల్లాలోని పలు శాఖలు కలిసి సుమారు రూ.5,700 కోట్లకు పైగా వ్యయ అంచనాలతో ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఘాట్ల నిర్మాణం, విస్తరణ, కాలువల విస్తరణ, తాగునీటి నిర్వహణ, విద్యుత్ సౌకర్యాలు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టి రాజమహేంద్రవరం నగర పరిధిలోనే 17 ఘాట్లను విభాగాల వారీగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రద్దీ నియంత్రణ కోసం స్నాన ఘాట్ల విస్తరణతో పాటు, గోదావరి ఘాట్ల చుట్టూ రహదారులు, పార్కింగ్, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాల ఏర్పాట్లను దీర్ఘకాల, తాత్కాలిక పనులుగా వర్గీకరించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రవాణా, వసతి, భక్తుల సౌకర్యాలు
పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని విజయవాడ–రాజమహేంద్రవరం రూట్‌పై ప్రత్యేక రైళ్లు నడపాలన్న అంశంపై రైల్వే శాఖ ఇప్పటికే పరిశీలన ప్రారంభించింది. నిడవోలూ, గోదావరి, కొవ్వూరు వంటి కీలక రైల్వే స్టేషన్లలో అదనపు వసతులు, వేచి గదులు, టికెట్ కౌంటర్లు, పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు వెళ్లగా, పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు కనీసం రెండు రోజులు జిల్లాలోనే ఉండేలా ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక కేంద్రములతో లింకులు కల్పించే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటక శాఖ, దేవాదాయ, మున్సిపల్, పోలీస్, రవాణా, ఆరోగ్యశాఖల సమన్వయంతో కొత్త సంవత్సరంలో నుంచే పనులకు శ్రీకారం చుడుతూ, గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా స్థాయిలో నిర్వహించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.