ఒక్కపరుగు తేడాతో అమరావతిపై గెలువు
శ్రీష్టి శేఖర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్
మంగళగిరి: మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) సీజన్లో మూడో రోజైన సోమవారం తొలి మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. అమరావతి ఈ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోదావరి జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. కే. పుష్పిత 40 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేయగా, కెప్టెన్ హేన్రిట్టా పెరీరా 28 బంతుల్లో నాలుగు ఫోర్లతో 37 పరుగులు సాధించింది. అమరావతి బౌలర్లలో సాయి పూజిత రెండు వికెట్లు, జోషి, ఎస్. లక్ష్మి చెరో వికెట్ పడగొట్టారు. 145 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి ఈ ఛాంపియన్స్ చివరి వరకు పోరాడినా నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. Happy కాండ్రేగుల దేవిక 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు చేసి ఆకట్టుకోగా, కాట్రగడ్డ దీక్ష 24 బంతుల్లో 29, రంగ లక్ష్మి 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసింది. గోదావరి బౌలర్లలో కే. హారిక మూడు వికెట్లు, క్రీష్టి శేఖర్ రెండు వికెట్లు పడగొట్టగా, విన్నీ, అక్షయ చెరో వికెట్ సాధించారు. ముఖ్యంగా శ్రీష్టి శేఖర్ నాలుగు ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గోదావరి గోల్డెన్ ఈగల్స్ ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసుకోగా, అమరావతి ఈ ఛాంపియన్స్‌కు తొలి ఓటమి ఎదురైంది.