వినోద ప్రపంచంలో తళుకుబెళుకుల వెనక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు.. భయానక పోరాటాలు దాగి ఉంటాయి. తెరపై అందంగా కనిపించే తారల జీవితాలు ఆరంభం నుంచే సులభంగా సాగిపోవని చెప్పడానికి యువ నటి కయాదు లోహర్ ప్రయాణమే ఒక చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామ, వెండితెరకు రాకముందు తాను పడిన కష్టాలను.. దినదిన గండంలా గడిచిన తన గతాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు. అసోం మూలాలున్నా కానీ పుణెలోనే పుట్టి పెరిగిన కయాదు లోహర్ తన కుటుంబ నేపథ్యం గురించి చెబుతూ తాను ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్న వయసులోనే కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇందులో భాగంగానే పదో తరగతి చదివే వయసులోనే ఉ ద్యోగాలు చేయడం మొదలుపెట్టారు. ఒకానొక దశలో కాఫీ షాప్లో టీలు అందించే పని చేయడంతో పాటు.. బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా కూడా పని చేసినట్లు నిర్మొహమాటంగా తెలిపారు. ఆ చిన్న ఉద్యోగాలతోనే తన కెరీర్ ప్రయాణం ప్రారంభమైందని.. ఆ కష్టకాలమే తనకు జీవితం ఎంతో నేర్పించిందని తెలిపారు. జీవితంలో తన కాళ్లపై తాను నిలబడేందుకు కేవలం చిన్నచిన్న పనులే కాకుండా.. ఆ తర్వాత ఒక దశలో ఐటీ (సాఫ్ట్వేర్) ఉద్యోగంలో కూడా చేరారు. అయితే అక్కడ కార్పొరేట్ ప్రపంచానికి తగినట్లుగా ఉండలేకపోయానని.. తీవ్రమైన పని ఒత్తిడిని భరించలేక ఒకరోజు ఆఫీసులోనే కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్లు కయాడు లోహర్ గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువు కంటే నాటకాలు, స్టేజ్ పెర్ఫార్మెన్స్లు, డ్యాన్స్ అంటేనే తనకు ఎంతో ప్రాణం ఉండేదని.. ఆ ఆసక్తే తనను చివరకు కళారంగం వైపు నడిపించిందని ఆమె వెల్లడించారు.