లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ యువ సంచలనం అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 35 బంతుల్లో 84 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ యువ ఆటగాడి శైలిని గవాస్కర్ కొనియాడారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ బ్యాటింగ్ వేగాన్ని తన కాలం నాటి క్రికెట్‌తో పోలుస్తూ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సునీల్ గవాస్కర్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ పట్ల తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. "ప్రస్తుత తరం ఆటగాళ్ల బ్యాటింగ్ శైలిని చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. నిజం చెప్పాలంటే, నా కాలంలో నేను ఒక వరుగు తీయడానికి ఎన్ని బంతులు తీసుకునేవాడినో, ఇప్పుడు ఈ అబ్బాయి అన్ని బంతుల్లో ఏకంగా యాభై పరుగులు పూర్తి చేస్తున్నాడు" అని గవాస్కర్ చమత్కరించారు. తన సుదీర్ఘ కెరీర్లో గవాస్కర్ రక్షణత్మాక ధోరణికి పేరుగాంచిన సంగతి తెలిసిందే. అందుకే ప్రస్తుత టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు చూపిస్తున్న దూకుడును ఆయన వింతగా, అద్భుతంగా భావిస్తున్నారు. అభిషేక్ శర్మ కేవలం కళ్లు మూసుకుని బ్యాట్ ఊపడం లేదని, ప్రతి షాట్ వెనుక ఒక పద్ధతి ఉందని గవాస్కర్ విశ్లేషించారు. "చాలామంది యువ ఆటగాళ్లు కేవలం హిట్టింగ్ చేయడానికే ప్రయత్నిస్తారు. కానీ అభిషేక్ దగ్గర సరైన టైమింగ్ ఉంది. అతను మైదానం నలుమూలల షాట్లు ఆడగలడు. ముఖ్యంగా స్పిన్నర్లపై అతను విరుచుకుపడుతున్న తీరు భారత క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకం" అని గవాస్కర్ పేర్కొన్నారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ శర్మ టీ20 క్రికెట్లో 5 వేల పరుగుల మైలురాయిని కూడా చేరుకున్నాడు. అది కూడా ప్రపంచంలోనే అత్యంత తక్కువ బంతుల్లో (2898 బంతులు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలవడం విశేషం. భారత జట్టు ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ ఉన్న తరుణంలో అభిషేక్ శర్మ ఇలాంటి ప్రదర్శన చేయడం సెలెక్టర్లకు సవాలుగా మారింది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజం నుంచి ప్రశంసలు అందుకోవడం అభిషేక్‌కు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు. గవాస్కర్ ఇంకా మాట్లాడుతూ, "అతని ఇన్నింగ్స్ లో ఎక్కడా అనవసరమైన భయం కనిపించలేదు. కివీస్ బౌలర్లు ఎంత వేగంగా బంతులు వేసినా, అతను ఎంతో ప్రశాంతంగా వాటిని సరిహద్దులు దాటించాడు. ఇలాంటి నిర్భయమైన క్రికెట్ ఇప్పుడు భారత జట్టుకు చాలా అవసరం" అని అన్నారు. సోషల్ మీడియాలో కూడా గవాస్కర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 'లిటిల్ మాస్టర్' స్వయంగా ప్రశంసించారంటే అభిషేక్ శర్మలో ఎంతటి ప్రతిభఉందో అర్థం చేసుకోవచ్చని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో రాటుదేలిన అభిషేక్, ఇప్పుడు భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. న్యూజిలాండ్ జరిగిన ఈ మ్యాచ్ కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో అతను మరిన్ని రికార్డులు సృష్టిస్తాడని క్రీడా విశ్లేషకులు జోస్యం చెపుతున్నారు.