అసెంబ్లీలో ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారు
20 నెలల కూటమి పాలనలో అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమి ఏర్పాటు
రాజధాని రైతుల త్యాగం మరువలేనిది
2026 నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపడతామని సీఎం వెల్లడి
తిరుపతి లడ్డూ వివాదంలోకి హెరిటేజ్‌ను లాగి బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహం
ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బతీయడమే ఫ్యాక్షనిస్టుల లక్ష్యమని వ్యాఖ్యలు
దేవాలయాల పవిత్రతను కాపాడతామని స్పష్టీకరణ
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో చంద్రబాబు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, పాలకులు అసెంబ్లీలో తనను అవమా నించిన తీరుకు కన్నీళ్లు పెట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే 2019-24 మధ్య ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారని, ప్రజలు అన్నింటినీ గమనించి సరైన సమయంలో తీర్పు ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి రాగానే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని గుర్తుచేశారు.
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనా కాలంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది నాడు కనీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. శు క్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం చంద్రబాబు సాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చట్టసభ అనేది ప్రజా దేవాలయమన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యులకంటే.. మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. 2019-2024 మధ్య తనలా కన్నీళ్లు పెట్టుకున్న వారెందరో ఉన్నారని ప్రస్తావించారాయన. కూటమి ప్రభుత్వ హయాంలో 20 నెలల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు.. 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. భూములిచ్చిన రైతులకు మనం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. అభివృద్ధి చేసి ఎ÷-లాట్లు ఇస్తామని చెప్పామని తెలిపారు. నోటీసులివ్వకుండా నన్ను అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. నాడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్లు.. నేడు నీతులు చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్రోట్తోతో తమను గెలిపించారని తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదని చెప్పుకొచ్చారు. ఈ ఏడాదిలో 1,000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామన్నారు. 20 నెలల్లో ఇంత చేయగలిగామా.! అని ఆశ్చర్యపోయేలా అందరూ సహకరించారని తెలిపారు. విభజన జరిగడం వల్ల రాష్ట్రానికి కొంత మేర నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. నాడు ఏ వైపూ తాను సపోర్టు చేయకుండా తటస్థంగా ఉ న్నానని వివరించారు. 2014- 2019 మధ్య ఏడాదిలోనే అసెంబ్లీ కట్టామని.. ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం 29వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయామన్నారు. అయితే అదే టెంపో కంటిన్యూ అయి ఉంటే రికవర్ అయ్యేవాళ్లమని చెప్పుకొచ్చారు. నాడు ముగ్గురు కలిసి పోటీ చేశామని.. కేంద్రం కూడా భాద్యత తీసుకోవాల్సి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. 'రాష్ట్రంలో వైసీపీ హయాంలోని విధ్వంసంపై 7 శ్వేతపత్రాలు ఇచ్చాం. సంక్షేమంలో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డీబిటీ ప్రోగ్రాం చేస్తున్నాం. రూ.2700 కోట్లు నెలకు ఈ పథకం కింద ఇస్తున్నాం. బకాయిలు కూడా ఇచ్చాం. పిల్లలందరికి తల్లికి వందనం పథకం కింద రూ.10,700 కోట్లు ఇచ్చాం. స్త్రీశక్తి ద్వారా సుమారు 443 కోట్ల మంది ప్రయాణం చేశారు. ఈ విషయంలో ఆర్టీసీని అభినందిస్తున్నా. ఈ ప్రోగ్రాం సక్సెస్ మాత్రమే కాదు.. ప్రభుత్వానికీ మంచి పేరు తెచ్చింది. త్వరలో మరో వెయ్యి ఏసీ బస్సులు తెస్తాం. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల నగదును రైతుల అకౌంట్లలో వేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటిన్లను ఏర్పాటు చేస్తున్నాం' అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపోతే ప్రతిపక్ష పార్టీ నేత రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోననే భయం ప్రజల్లో నెలకుంటోందన్నారు. ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యం, రోడ్డంతా బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే ఆరు గంటలా? ఆ సమయంలో ప్రజలు నరకం అనుభవించాలా? జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించు కోవడం లేదు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సున్నితమైన సమస్య. దీనిపై ఎక్కువ మాట్లాడకూడదనుకున్నా.
కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వేంకటేశ్వర స్వామి విషయంలో తెలిసి కానీ.. తెలియక కానీ తప్పు చేయను. నిద్ర రానప్పుడు ఆయన్ను తలచుకుంటే వచ్చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను ప్రక్షాళన చేశాం. తిరుమల లడ్డూ కల్తీకి.. హెరిటేజ్‌కు ఏం సంబంధం? ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా కూడా అడగలేదు. పత్రిక ఉంది కదా అని పెద్ద హెడ్లైన్లు పెడుతున్నారు. వాళ్ల ఉద్దేశం బ్రాండ్ దెబ్బతీయడమే. బ్రాండ్ డ్యామేజ్ చేస్తే హెరిటేజ్‌కు నష్టం వస్తుందనేది వాళ్ల భావన అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.