334 కోట్లతో 3.5 కి.మీ. ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
30 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యం
విశాఖ పోర్టు సామర్థ్యం పెరుగుతుంది కేంద్ర మంత్రి సోనోవాల్ వెల్లడి
సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా విశాఖపట్నం ఓడరేవులో కీలక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రూ. 334.89 కోట్ల అంచనా వ్యయంతో అంతర్గత ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) నిర్మాణానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. మంగళవారం ఈ విషయాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. కాన్వెంట్ జంక్షన్‌ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ దాదాపు 3.584 కిలోమీటర్ల పొడవున ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తొమ్మిది ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ ఇరుక్కుపోయే సమస్యకు చెక్ పడుతుంది. పోర్టు కార్యకలాపాలకు అంతరాయం లేకుండా నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 30 నెలల్లో ఈ ఫ్లైఓవర్‌ను వూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉ న్నామని చెప్పారు. ప్రధాని గతిశక్తి విధాన ప్రణాళికకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఈ కారిడార్.. విశాఖ పోర్టు సముద్ర రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచి, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడుతుందన్నారు.