Drishyam 3: మోహన్‌లాల్ – జీతూ జోసెఫ్ కాంబోలో వస్తున్న ‘దృశ్యం 3’ షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే చరిత్ర సృష్టిస్తోంది. మలయాళంలోనే కాదు, మొత్తం భారతీయ రీజినల్ సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా ఈ చిత్రాన్ని చూస్తున్నారు విశ్లేషకులు.
350 కోట్ల ప్రీ–బిజినెస్ సంచలనం
నిర్మాణ దశలోనే ‘దృశ్యం 3’ రూ.350 కోట్లకు చేరువైన ప్రీ–బిజినెస్ నమోదుచేసి మలయాళ సినిమా చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు సృష్టించింది. థియేట్రికల్, ఓవర్సీస్, డిజిటల్ హక్కుల డీల్స్ వలన ఈ మొత్తం సాధ్యమైందని, ఇది ఒక రీజినల్ సినిమా కోసం అనూహ్యమైన స్థాయి అని నిర్మాత ఎం. రంజిత్ స్పష్టం చేశారు. గతంలో రికార్డులు సృష్టించిన మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాల పూర్తిస్థాయి కలెక్షన్ల కంటే కూడా ‘దృశ్యం 3’ ప్రీ–బిజినెస్ ఎక్కువగా ఉండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనే ప్లాన్ ఈ రికార్డు వెనక ప్రధాన కారణంగా చెప్పబడుతోంది.
మోహన్‌లాల్ మ్యాజిక్ – ఫ్రాంచైజీకి ప్రత్యేక క్రేజ్
నలభై ఏళ్లకు పైగా దక్షిణాది తెరపై తనదైన నటనతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటున్న మహానటుల్లో మోహన్‌లాల్ పేరు ముందుంటుంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగుల్లోనూ ఆయనకు ఏర్పడిన అభిమాన వర్గం ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి పాన్ ఇండియా రేంజ్లో రెస్పాన్స్ రావడానికి ప్రధాన బలంగా మారింది. సాధారణ మధ్యతరగతి తండ్రి పాత్రలో జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్ నటన భారతీయ సినీ చరిత్రలో ఐకానిక్ పాత్రలలో ఒకటిగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో మొదటి రెండు భాగాలు మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఘన విజయం సాధించడంతో మూడో భాగంపై అంచనాలు ఆకాశమంత ఎత్తుకి చేరాయి.
‘దృశ్యం 3’పై అంచనాలు..
‘దృశ్యం 2’ తర్వాత కథను ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, క్లైమాక్స్‌ను ఎలా డిజైన్ చేయాలి అన్నదానిపై దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా కాలం పనిచేసి స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసినట్టు చెప్పుకున్నారు. ప్రస్తుతం ‘దృశ్యం 3’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఫ్రాంచైజీ ఫైనల్ చాప్టర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీమ్ సంకేతాలు ఇస్తోంది. ఈసారి రీమేక్ హక్కులు అమ్మకుండా, మలయాళంతోపాటు ఇతర భాషల్లోనూ నేరుగా రిలీజ్ చేయాలనే వ్యూహం తీసుకోవడం వాణిజ్య పరంగా గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 350 కోట్ల ప్రీ–బిజినెస్ హైప్, మోహన్‌లాల్ స్టార్ ఇమేజ్, జీతూ జోసెఫ్ క్రాఫ్ట్ – ఈ మూడు కలయికతో ‘దృశ్యం 3’ విడుదలయ్యే సరికి కొత్త బాక్సాఫీస్ చరిత్ర రాయడం ఖాయమనే బజ్ ప్రస్తుతం మలయాళంతో పాటు మొత్తం భారతీయ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.