అమరావతి : 'హిందూపురం నియోజకవర్గంలో నగరవనం అభివృద్ధి చేయాలి. ఇందుకు అవసరమైన రూ.24 కోట్లు విడుదల చేయాలి' అని ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. తన నియోజకవర్గంలోని కొన్ని అభివృద్ధి పనులపై చర్చించారు. స్పందించిన పవన్ నిధుల విడుదలకు అంగీకరించారు. అనంతరం ఎమ్మెల్సీ కె.నాగబాబు కూడా పవన్‌తో తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యే ఎం.అశోక్ రెడ్డి డిప్యూటీ సీఎంని కలసి తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి వివరించారు. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ సందడి చేశారు. ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బొజ్జల సుధీర్, ఎంఎస్ రాజుతో బాలకృష్ణ కొద్దిసేపు సరదాగా సంభాషించారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఉద్దేశించి.. 'ఏం డాకూ మహరాజ్' అని పిలిచారు. హంద్రీ నీవా నీళ్లు హిందూపురానికి కాదని మడకశిర తీసుకెళ్లిన రాజు.. డాకు మహరాజ్ అయ్యారని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతానికి నీళ్లు అవసరం ఎంతో ఉంటుందని, పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోవాలని ఎంఎస్ రాజు అన్నారు.