టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ గ్రీకువీరుడు, మన్మథుడు, కింగ్ అనగానే గుర్తొచ్చేది మాత్రం నాగార్జునే. 66 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రెట్ పంచుకున్నారు.తాను ఎప్పుడూ కడుపు మాడ్చుకొని డైటింగ్ చేయలేదు. వేళకు తింటాను. దానితో పాటు రోజూ కచ్చితంగా ఉదయం వ్యాయామం చేస్తాను. ఇప్పటికి 45 ఏళ్లుగా నేను జిమ్ చేస్తున్నాను. ఏరోజూ కూడా మిస్ అవలేదు. ఎప్పుడైనా ఆరోగ్యం బాలేక.. వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప మిగతా రోజుల్లో కచ్చితంగా జిమ్ కు వెళ్తా. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఏ విషయాన్నైనా పాజిటివ్ గా తీసుకుంటాను. ఎలాంటి సమస్య అయినా నన్ను నేను నిరుత్సాహపరుచుకోను అని చెప్పారు. ఇక 2025 గురించి నాగార్జున మాట్లాడుతూ తాను ఈ ఏడాది ఎంతో ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. కెరీర్ పరంగానే కాకుండా పర్సనల్ గానూ చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఇంతకుమించి తానేం కోరుకోవడం లేదన్నారు. ఈ సంవత్సరం అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారని.. అలాగే నాగచైతన్య- శోఖిత ఒక్కటై ఏడాది పూర్తయిందన్నారు. వాళ్లను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. నాగార్జున కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాదిలో ఆయన రెండు సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ'లో ఆయన నటించిన సైమన్ పాత్రకు మంచి ఆదరణ సొంతమైంది. అలాగే కుబేరలో మాజీ సీబీఐ అధికారి దీపక్ తేజ్ గా కనిపించి మెప్పించారు. ప్రస్తుతం తన 100వ సినిమా పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారనుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన శైలితో స్టార్ హీరోగా ఎదిగారు. రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా, యాక్షన్, మాస్, భక్తిరస చిత్రాల వరకు అన్ని జానర్లలో నటిస్తూ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. దశాబ్దాల కెరీర్లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగ్ ఇప్పుడు తన కెరీర్లో అత్యంత కీలకమైన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. 'నా సామిరంగ' సినిమా తర్వాత వెంటనే 100వ సినిమా మొదలుపెట్టాల్సి ఉన్నా ఇది మైలురాయి చిత్రం కావడంతో నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని కాస్త ఆలస్యం చేశారు. అయితే ఈ గ్యాప్ లో ఆయన ఖాళీగా మాత్రం లేరు. ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, విలన్ రోల్స్ చేయడంతో పాటు బిగ్ బాస్ లాంటి షోలతో కూడా ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు దగ్గరగానే ఉన్నారు. ఇప్పుడు 100వ సినిమా విషయంలో పూర్తిగా ఎ+-లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఈ మైలురాయి చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో జరగనున్నట్లు సమాచారం.