30 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వానలు
52శాతం లోటు వర్షపాతం నమోదు
అయినా తాగునీటికి ఇబ్బందులు రాకూడదు
తర్వాతి ప్రాధాన్యం పశువులు, పశుగ్రాసానికి వేసిన పంటలకు నీటి కొరత రాకూడదు
ఒక్క ఎకరా ఎండకూడదు.. జీఎస్ఓపీ తగ్గకూడదు
ఎప్పటికప్పుడు పరిస్థితిని కేంద్రానికి నివేదిద్దాం
వీలైనంత ఎక్కువ విపత్తు నిధులు సాధిద్దాం
కరువు పరిస్థితుల్లోనూ గొడ్డలి పార్టీ రాజకీయం
ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పంటలకు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం..
మంత్రులు తిప్పికొట్టాలి నిత్యావసర ధరలపై నిరంతర సమీక్ష
క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్దేశం
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, గడచిన 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం నమోదైందని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్నమయ్య జిల్లాలో అతి తక్కువగా 76 శాతం, ప్రకాశం జిల్లాలో 70 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందన్నారు. దేశంలో లోటు వర్షపాతం 14 శాతంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా సగటున 52 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ఈ పరిస్థితుల్లో అన్ని శాఖలూ ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కోవడంపై దృష్టి సారించాలని కోరారు. తాగునీటికి ప్రథమ ప్రాధాన్యమిచ్చి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత పలు అంశాలపై సీఎం మంత్రులతో మాట్లాడారు. ఎల్‌నినోపై సుదీర్ఘ చర్చ జరిగింది. తాగునీటికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు తలెత్తకూడదని, భూగర్భ జలాల పరిస్థితిని అంచనా వేస్తూ అవసరమైన చోట్ల బోర్లు వేసైనా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాతి ప్రాధాన్యం పశువులు, పశుగ్రాసానికి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే వేసిన వంటలకు నీటి కొరత లేకుండా చూడాలని, ఎల్‌నినో కారణంగా ఒక్క ఎకరా కూడా ఎండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్పీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలినినో పరిస్థితులను ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఈ రోజే కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీలను, సాగునీటి వినియోగదారుల సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు.
గొడ్డలి పార్టీ ప్రచారంపై జాగ్రత్త
ఓపక్క రాష్ట్రంలో పరిస్థితులు తీవ్ర వర్షాభావంతో కరువు ఛాయలను తలపిస్తుంటే.. గొడ్డలి పార్టీ మాత్రం దీనిని కూడా రాజకీయం చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పంటలకు ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తోందని.. దీనిని గట్టిగా తిప్పికొట్టాలని మంత్రులను ఆదేశించారు. 'తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోంది. మనం సమర్థంగా ప్రజలకు, రైతులకు చెప్పి వారిని చైతన్యవంతులను చేయాలి. అవసరమైతే వారితో గ్రామస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలి' అని కోరారు. వెలిగొండ ప్రారంభోత్సవం, పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదలను గొడ్డలి పార్టీ తన ఘనతగా తప్పుడు ప్రచారం చేసుకుంటోందన్నారు. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి మంచినీ ప్రజలకు వివరించాలని కోరారు. మంత్రులు మరింతగా క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. తమిళనాడులో విజయ్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనేది గమనించాలని సూచించారు.
నిత్యావసరాల ధరలపై దృష్టి పెట్టండి
ఎల్‌నినో సాకుతో నిత్యావసర ధరలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతాయని, నిత్యం పర్యవేక్షిస్తూ ధరలను కట్టడి చేయాలని సీఎం మంత్రులను కోరారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఈ బాధ్యత చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో జటిలమైన సమస్యల పరిష్కారంపై ఇన్చార్జి మంత్రులు దృష్టిపెట్టాలని చెప్పారు. తేలని సమస్యలను ఇన్చార్జి మంత్రి.. సంబంధిత శాఖ మంత్రి వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రజల అధీనంలో ఉన్న సుమారు 6వేల ఎకరాలకు పట్టాలు లేవని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వారు పోరాడుతూనే ఉన్నారని.. దీనికి 2 నెలల్లో పరిష్కారం చూపాలని ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.