వెంటనే విధుల్లోకి వచ్చేస్తానంటున్నారు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు సూచించా
ప్రజాసేవలో పడి భుజాల గాయాలను నిర్లక్ష్యం చేశారు
ప్రస్తుతం నిలకడగా జనసేనాని ఆరోగ్యం
మూడు వారాలు ఫిజియోథెరపీ ఉంటుంది
నూతనోత్సాహంతో తిరిగొస్తారు: సీఎం చంద్రబాబు
'ప్రజా క్షేత్రంలోకి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నూతనోత్సాహంతో, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారు. కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తయినందున వెంటనే విధుల్లోకి వస్తానని ఆయన అన్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించా' అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జనసేనానిని ఆదివారం చంద్రబాబు, మంత్రులు పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్ పరామర్శించారు. ముఖ్యమంత్రి వచ్చే సమయానికి ఆస్పత్రిలోనే ఉన్న మంత్రి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్.. ఆయన్ను వవన్ వద్దకు తీసుకువెళ్లారు. పవన్ కల్యాణ్ , ఆయన సతీమణి అన్నాతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. శస్త్రచికిత్స చేసిన వైద్యులతోనూ మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 'ఏళ్ల తరబడి రెండు భుజాలకు ఉన్న తీవ్ర గాయాలను ప్రజా సేవలో నిమగ్నమై పవన్ కల్యాణ్ పట్టించుకోలేదు. చిన్న చిన్న విషయాలను ఆయన పట్టించుకోరు. ప్రజల్లో ఉ న్నప్పుడు, పర్యటనల సమయంలో ఆయన మీదకు అభిమానులు ఆప్యాయంగా దూసుకురావడం, చేతులు పట్టుకుని లాగడం, తోపులాటల వల్ల భుజాలకు ఉన్న సమస్య తీవ్రమైంది. ఇటీవల ఆయన వైద్య పరీక్షలకు వచ్చిన సమయంలోనే సమస్య తీవ్రతను గుర్తించి, వెంటనే కుడి భుజానికి శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ విజయవంతమైంది. 3 వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఫిజియోథెరపీతో భుజానికి ఉన్న సమస్య పరిష్కారమవుతుంది. ఎడమ భుజానికి కూడా సమస్య ఉ ందని వైద్యులు చెప్పారు. కుడి భుజానికి ఉన్న సమస్య తీరాక పరీక్షలు చేస్తారు. ఆపరేషన్ అవసరమా.. ఫిజియోథెరపీతో పరిష్కారమవుతుందా అన్నది అప్పుడు తేలుతుంది. పవన్ మునుపటి ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజాసేవలోకి తిరిగి వస్తారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం చాలా నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది' అని చెప్పారు.
పవన్ ఆరోగ్యం భేష్ త్వరగా కోలుకుంటున్నారు
ముంబై ఆస్పత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్టీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి శనివారం ఉదయం సర్జరీ నిర్వహించిందని.. ఆపరేషన్ విజయవంతమైందని.. పవన్ సౌకర్యంగానే ఉన్నారని, త్వరితగతిన కోలుకుంటున్నారని వివరించారు. 2-3 రోజుల్లో ఫిజియోథెరపీ ప్రారంభిస్తామని, 4 నెలల తర్వాత భుజం పనితీరు పూర్తిగా మెరుగుపడుతుందని వెల్లడించారు.