క్రికెట్ ప్రపంచంలో టీ20 ఫార్మాట్ అంటేనే ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో టీమ్ ఇండియాను నడిపించడం అంటే అది ఒక అరుదైన గౌరవం. ఇప్పటివరకు మన జట్టును ముగ్గురు దిగ్గజ కెప్టెన్లు మాత్రమే ఈ టోర్నీలో లీడ్ చేశారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 7న ముంబై వేదికగా అమెరికాతో జరిగే మ్యాచ్‌లో ఈ కొత్త ప్రయాణం మొదలవ్వబోతోంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ తరపున కెప్టెన్సీ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటివరకు 'తలా' ధోనీ, 'కింగ్' కోహ్లి, 'హిట్ మ్యాన్' రోహిత్ శర్మ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ ముగ్గురి నరసన సూర్యకుమార్ యాదవ్ పేరు చేరబోతోంది. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే పోరులో టాస్ వేయగానే.. భారత్‌ను వరల్డ్ కప్‌లో నడిపించిన నాలుగో కెప్టెన్‌గా సూర్య చరిత్ర సృష్టిస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న జట్టుకు నాయకత్వం వహించడం సూర్యకు ఒక పెద్ద సవాలే అని చెప్పవచ్చు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ ప్రయాణాన్ని చూస్తే, ఎంఎస్ ధోనీ ఏకంగా ఐదు ఎడిషన్లలో (2007, 2009, 2012, 2014, 2016) జట్టును నడిపించారు. ఆయన సారథ్యంలోనే 2007లో భారత్ మొదటిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఆ తర్వాత విరాట్ కోహ్లి 2021లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నా, దురదృష్టవశాత్తు భారత్ సెమీస్ చేరలేకపోయింది. ఇక రోహిత్ శర్మ 2022లో సెమీస్ వరకు తీసుకెళ్లి, 2024లో అద్భుతమైన విక్టరీతో భారత్‌కు రెండోసారి కప్పు అందించారు. ఇప్పుడు ఈ లెజెండరీ కెప్టెన్ల వారసత్వాన్ని సూర్య ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ముందు ఒక అరుదైన అవకాశం ఉంది. ఒకవేళ భారత్ ఈసారి కప్పు గెలిస్తే.. ధోనీ, రోహిత్ తర్వాత టైటిల్ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా సూర్య నిలుస్తారు. విరాట్ కోహ్లికి సాధ్యం కాని ఈ ఘనతను సూర్య సాధిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండటం, అలాగే 2024 విక్టరీ తర్వాత టీమ్ ఫుల్ ఫామ్‌లో ఉండటం సూర్యకు కలిసొచ్చే అంశాలు. బ్యాటర్‌గా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సూర్య, ఇప్పుడు లీడర్ గా తన సత్తా ఏంటో చూపించాలనుకుంటున్నారు. 2026 వరల్డ్ కప్ గనుక భారత్ గెలిస్తే, క్రికెట్ చరిత్రలో ఎన్నో 'ఫస్ట్ టైమ్' రికార్డులు మన పేరిట నమోదవుతాయి. మూడు టీ20 వరల్డ్ కప్? లు గెలిచిన మొదటి జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తుంది. అంతేకాదు, వరుసగా రెండు ఎడిషన్లు గెలిచిన తొలి టీమ్ గా కూడా నిలుస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పటివరకు ఏ ఆతిథ్య దేశం కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. ఈసారి నూర్య సేన గెలిస్తే, హోమ్ గ్రౌండ్లో కప్పు గెలిచిన మొదటి దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 2024 వరల్డ్ కప్ ఫైనల్ అనగానే మనందరికీ సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఆ అద్భుతమైన క్యాచ్ గుర్తుకొస్తుంది. సౌత్ ఆఫ్రికా చేతుల్లోకి వెళ్లిన మ్యాచ్‌ను ఆ ఒక్క క్యాచ్ తో సూర్య భారత్ వైపు తిప్పేశారు. అప్పుడు ప్లేయర్‌గా కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన సూర్య, ఇప్పుడు నాయకుడిగా ఆ కప్పును కాపాడుకోవాలని చూస్తున్నారు. తన బ్యాటింగ్ స్కిల్స్‌తో పాటు కెప్టెన్సీ వ్యూహాలతో టీమ్ ఇండియాను వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలబెట్టాలని సూర్య పట్టుదలతో ఉన్నారు. మార్చి 8న జరిగే ఫైనల్లో సూర్య ఆ ట్రోఫీని ఎత్తుతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సీనియర్లు లేని లోటును సూర్య తన నాయకత్వంతో భర్తీ చేస్తూ భారత్‌కు మూడోసారి ప్రపంచకప్ అందిస్తాడో లేదో చూడాలి.