CBSE (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) 10వ తరగతి విద్యార్థులు 2026 నుండి సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు రాయనున్నారు. ఎగ్జామ్ కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ బుధవారం ఈ మేరకు సమాచారం ఇచ్చారు. కొత్త పరీక్షా విధానం ప్రకారం, మొదటి పరీక్ష అందరు విద్యార్థులకు తప్పనిసరి. రెండవ పరీక్ష అప్షనల్ గా ఉంటుంది.
మొదటి పరీక్ష ఫిబ్రవరిలో అదేవిధంగా రెండవ పరీక్ష మేలో జరుగుతుంది. ఫలితాలు ఏప్రిల్ అలాగే, జూన్లలో ప్రకటిస్తారు. ఇక ఈ విధానం అమలులోకి రానుండడంతో సప్లిమెంటరీ పరీక్షలు రద్దు అవుతున్నాయి. అయితే, ఈ నిర్ణయం ప్రస్తుతం 12వ తరగతి బోర్డుకు వర్తించదు.
కొత్త పరీక్షా విధానం గురించి 3 ముఖ్యమైన విషయాలు
- రెండవ పరీక్షలో అంటే అప్షనల్ ఎగ్జామ్ లో, విద్యార్థులు సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలలోని ఏవైనా 3 సబ్జెక్టులలో తమ మార్కులను మెరుగుపరచుకోవడానికి అనుమతిస్తారు.
- శీతాకాల పాఠశాలల విద్యార్థులు రెండు పరీక్షలలో దేనినైనా రాయడానికి వీలవుతుంది.
- ఒక విద్యార్థి మొదటి పరీక్షలో 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులలో హాజరు కాకపోతే, అతను/ఆమె రెండవ పరీక్షకు హాజరు కావడానికి అనుమతి ఇవ్వరు.
CBSE ఈ నిర్ణయం గురించి మరిన్ని వివరాలు..
ఈ నియమం 2025-26 విద్యా సంవత్సరం నుండి అమలులోకి వస్తాయి. అంటే 2026 సంవత్సరంలో బోర్డు పరీక్షలు రెండుసార్లు నిర్వహిస్తారు.
ప్రతి విద్యార్ధి రెండు సార్లు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. దీనికోసం విద్యార్థులకు 3 ఎంపికలు ఉంటాయి.
1. సంవత్సరానికి ఒకసారి పరీక్ష రాయవచ్చు.
2. రెండు పరీక్షల్లోనూ హాజరు కావడం.
3. విద్యార్ధి ఏ సబ్జెక్టులోనైనా బాగా రాణించలేదని అంటే సరిగ్గా రాయలేకపోయానని భావిస్తే రెండవ పరీక్షలో ఆ సబ్జెక్టు పరీక్షను మళ్ళీ రాయవచ్చు.
రెండు సార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు, మెరుగైన ఫలితం తుదిగా పరిగణిస్తారు. అంటే, రెండవసారి పరీక్ష రాసిన తర్వాత మార్కులు తగ్గితే, మొదటి పరీక్ష మార్కులు ఫైనల్ గా పరిగణలోకి తీసుకుంటారు.
రెండు పరీక్షలకు పరీక్షా కేంద్రం ఒకేలా ఉంటుంది. అలాగే, రెండు పరీక్షలకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే, మీరు రెండుసార్లు పరీక్ష రాయాలనే ఆప్షన్ ఎంచుకుంటే, రెండు పరీక్షలకు కలిపి ఫీజు కట్టాల్సి ఉంటుంది.
ఈ విధానంలో ప్రాక్టికల్, ఇంటర్నల్ పరీక్షలు ఒక్కసారి మాత్రమే జరుగుతాయి. ఇవి మునుపటిలాగే డిసెంబర్-జనవరిలో నిర్వహిస్తారు.
ఆగస్టు 2024లో ముసాయిదా..
సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష నిర్వహణకు సంబంధించిన ముసాయిదాను ఆగస్టు 2024లో రూపొందించారు. ఈ సందర్భంగా విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జెఇఇ) రాయగలరని, అదేవిధంగా విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10వ తరగతి పరీక్ష రాయగలరని అన్నారు.
సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం గురించి విద్యా మంత్రిత్వ శాఖ గత వారం ఫిబ్రవరి 19న CBSE బోర్డు కార్యదర్శి, ఇతర విద్యావేత్తలతో చర్చించింది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ CBSE, NCERT, KVS, NVS, అనేక పాఠశాల అధికారులతో సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం గురించి చర్చించారు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.