పూర్తిస్థాయిలో నేవీ రిహార్సల్స్
అబ్బురపరచిన విన్యాసాలు
బీచ్ రోడ్డులో విదేశీ సేనల కవాతు
నేడు రాష్ట్రపతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాక
సీఎం చంద్రబాబునాయుడు రాక రేపు
విశాఖపట్నం: వైమానిక దళం సాహన విన్యాసాలతో అదరహో అనిపించింది. విదేశీ సేనల కవాతుతో సాగర తీరం సరికొత్త కళ సంతరించుకుంది. నేవీ ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆర్కే బీచ్ లో పూర్తి రిహార్సల్స్‌ను నిర్వహించింది. తొలుత భారత నౌకాదళానికి చెందిన వైమానిక విభాగం తన అమ్ములపొదిలోని యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను వంతుల వారీగా గగనతలంలో మెరిపించి మురిపించింది. ఆ తరువాత శత్రుసేనలపై దాడికి దిగితే ఎలా ఉ ంటుందో చేతల్లో చూపించింది. జెమినీ బోట్లపై శత్రుమూకలపైకి వెళ్లడం, ఆపదలో ఉ న్నవారిని హెలికాప్టర్లలో వెళ్లి రక్షించడం వంటివన్నీ కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. ఆఖరున ఆహ్వానిత దేశాల ప్రతినిధులు వారి వారి సంస్కృతీ సంప్రదాయాలతో కవాతు చేస్తూ బీచ్ రోడ్డులో 'పరేడ్' నిర్వహించారు. మంగళవారం సాయంత్రం కూడా మరోసారి పూర్తిస్థాయి ప్రాక్టీస్ చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రముఖుల రాక
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎస్ఆర్) నేపథ్యంలో నగరానికి పలువురు ప్రముఖులు రానున్నారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోపాటు పలువురు నగరానికి వస్తున్నారు. రాష్ట్రపతి మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు చేరుకుంటారు. అక్కడ ఆమెకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి వవన్‌కల్యాణ్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, నేవీ అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం ఆమె సేవల్ బేస్‌కు చేరుకుని విందులో పాల్గొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఐఎస్ఆర్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం నేవల్ బేస్‌కు చేరుకుని మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరి వెళతారు.
రేపు రానున్న సీఎం
ఐఎస్ఆర్ పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 18న నగరానికి రానున్నారు. ఉదయం 8 గంటలకు విజయవాడలో బయలుదేరి 9.20 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ జెట్టీకి వెళ్లి భారత రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. ఆమెతో పాటు ఐఎస్ఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళతారు.
నేడు పవన్ కల్యాణ్ రాక
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఐఎస్ఆర్ వేడుకల్లో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఐఎన్ఎస్ డేగా వద్ద గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతితో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన అనంతరం నగరంలో బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 9.40 గంటలకు తూర్పు నౌకదళ కేంద్రానికి చేరుకుని ఐఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఐఎన్ఎస్ డేగా వద్ద రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి మంగళ, బుధవారాల్లో నగరంలో పర్యటించనున్నారు. ఐఎస్ఆర్ పాల్గొనేందుకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం వలుకుతారు. 18వ తేదీ రాత్రి 11.20 గంటలకు విశాఖ నుంచి రైలులో విజయవాడ వెళతారు.