పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పవన్ కళ్యాణ్ గురించి అత్యంత భావోద్వేగంగా స్పందించారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను 15 ఏళ్ల వయసు నుంచి చూస్తున్నాను. ఆయన ఎప్పుడూ తనదైన దారిలోనే నడిచాడు. ఎవరి అడుగుజాడల్లోనూ నడవడు. తన మనస్తత్వానికి అనుగుణంగా ఎంతటి ఒత్తిడులు వచ్చినా, విమర్శలు ఎదురైనా వెనకడుగు వేయడు. నిజంగా తనను తానే చెక్కుకున్న శిల్పి పవన్ కళ్యాణ్.” అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు.
పవన్ సినీప్రవేశం గురించి బ్రహ్మానందం తనదైన శైలిలో చెబుతూ “నటుడు కావడం కూడా పవన్‌కు అనుకోకుండా జరిగిన విషయం. చిరంజీవి గారూ, ఆయన సతీమణి కూడా ఆయనను ప్రోత్సహించి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేయించారు. ఆ తర్వాత సినిమాలు, రాజకీయాలు అన్నీ ఒకేలా జరిగిపోయాయి.” అని వివరించారు.
ఇక పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేసిన బ్రహ్మానందం ఒక సందర్భంలో బాగా ఎమోషన్ అయ్యారు.
“అతని జాతకం నాకు తెలీదు గానీ… మెడపై చేయి వేసినా స్టైల్, ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా స్టైల్. పవన్ కళ్యాణ్ ఒక కారణజన్ముడు. ఎప్పటికైనా ఆయన ఒడిలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవాలని ఉంది.” అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు.
ఇక ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. “హరిహర వీరమల్లు సినిమాకి ముందే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్‌లో ఔరంగజేబ్లాంటి నియంతను ఓడించాడు. వెండితెరపై కాకుండా ప్రజల గుండెల్లోని హీరో అతను. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనే కాదు, ఆత్మదైర్యం కూడా కనిపిస్తుంది.” అంటూ రఘురామ కృష్ణరాజు చెప్పుకొచ్చారు.
“పవన్ అంటే ఒక ఆవేశం, ఉద్వేగం. పవన్ కల్యాణ్ నటనకి మించి మంచి మనిషి. దేశం మీద, సమాజం మీద ఉన్న ప్రేమ అతనిని భిన్నంగా నిలబెడుతోంది.” అని రఘురామ కృష్ణరాజు పొగడ్తల వర్షం కురిపించారు.