Bihar Elections బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలలో, తొలి విడతలో 18 జిల్లాలకు చెందిన 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
భద్రతా దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టగా, సుమారు 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాధారణంగా పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది, అయితే కొన్ని సున్నితమైన నియోజకవర్గాల్లో భద్రతా కారణాల వల్ల సాయంత్రం 5 గంటలకే ముగియనుంది.
మొత్తం 121 నియోజకవర్గాల్లో 1,314 మంది అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో ఉన్నారు. వీరిలో 122 మంది మహిళలు కాగా, జనసురాజ్ పార్టీ తరఫున ఒక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఈ విడతలో ఎన్డీఏ కూటమి తరపున జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో, బీజేపీ 48 స్థానాల్లో, ఎల్జేపీ 14 స్థానాల్లో, రాష్ట్రీయ లోక్ మోర్చా 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమిలో ఆర్జేడీ 73 స్థానాల్లో, కాంగ్రెస్ 24, సీపీఐ (ఎంఎల్) 14 స్థానాల్లో పోటీ చేస్తోంది.
ప్రశాంత్ కిశోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ 119 అభ్యర్థులను బరిలో నిలిపింది.
Bihar Elections తొలి విడతలో కీలక నియోజకవర్గాలు
ఈ విడతలో అత్యంత చర్చనీయాంశంగా నిలుస్తున్నది రాఘోపూర్ నియోజకవర్గం. ఇక్కడ ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్పోటీ చేస్తున్నారు. ఆయనకు బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ యాదవ్ గట్టి సవాల్ విసురుతున్నారు.
ఇదే నియోజకవర్గంలో తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మద్దతు ఇస్తున్న పార్టీ జనశక్తి జనతాదళ్అభ్యర్థి మరియు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి చంచల్ సింగ్ పోటీలో ఉండడం వల్ల స్థానిక రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
Bihar Elections ఈ తొలి విడత ఫలితాలు బిహార్ రాజకీయాల భవిష్యత్తుకు దిశానిర్ధేశకంగా నిలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.