బిహార్ లో సరికొత్త రాజకీయం ఆవిష్కృతం అయ్యింది. అలాగే బిజెపికి అతిపెద్ద షాక్ తగిలింది. బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. గత 30 ఏళ్లుగా బిజెపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరేశారు. ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఉదయం కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ బీజేపీ నేత నీరజ్ కుమార్ కంటే ముందంజలో ఉన్న ప్రశాంత్ కిశోర్ ఒక్కో రౌండ్ ముగిసేసరికి తన ఆధిక్యాన్ని అంతకంతకూ పెంచుకున్నారు. పీకేకు 68,203 పోలయ్యాయి. అలానే రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 44,250, మూడో స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి రేఖ కుమారి 14,085 ఓట్లు సాధించారు. ఈ చరిత్రాత్మక విజయం అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తన గెలుపు బీజేపీ హైకమాండ్‌కు ఒక బలమైన సందేశమని వ్యాఖ్యానించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తిని బిహార్ ముఖ్యమంత్రిగా చేశారని తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, సామ్రాట్ చౌదరిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉపఎన్నిక ఫలితం బిహార్ రాజకీయాల్లో సరికొత్త మార్పునకు సంకేతమని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. బంకీపూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. దీంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు. బీజేపీ కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గంలో.. 1995 నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అసాధారణ విజయం సాధించడం, బీజేపీ కంచుకోటలో జేఎస్పీ జెండా ఎగురవేయడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రశాంత్ విజయంతో.. జేఎస్పీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి.
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ. బంకీపూర్ ప్రజల విజయమిది అని అన్నారు. 30 సంవత్సరాల పాత కోట 30 రోజుల్లో కూలిపోయిందని ఆయన అన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యేను ఎన్నుకునే ఎన్నిక కాదని బీహార్‌కు మంచి ముఖ్యమంత్రి కావాలని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ప్రజలు పంపిన సందేశమని చెప్పారు. నేరపూరిత నేపథ్యం లేదా ప్రవర్తనపై ప్రశ్నలున్న వ్యక్తి నాయకత్వం ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. విద్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు సృష్టించి బీహార్ యువత వలసలు ఆపే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా బీహార్‌కు కేవలం పేదరికం, అవినీతి మాత్రమే లభించాయని ఆయన ఆరోపించారు. బంకీపూర్‌లో రెండు మూడు నెలల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యే అయినంత మాత్రాస బంకీపూర్ బెంగళూరు కాదని అయితే కొంత అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు. ఈ విజయం బీహార్ అభివృద్ధికి అంకితమని ఆయన స్పష్టం చేశారు.