ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయంలో 2025వ సంవత్సరానికి గాను భవానీ దీక్ష ధారణ కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. ఆలయ 6వ అంతస్తులోని మహామండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముందుగా, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రధాన ఆలయం నుండి 6వ అంతస్తు వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆలయ ఛైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఏఈఓ బి. వెంకటరెడ్డితో కలిసి ఆలయ ప్రాంగణం నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. "జై జై భవానీ" నినాదాలతో భవానీలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.
ఆలయ స్థానాచార్యులు వి. శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భవానీలు 6వ అంతస్తులో గుమిగూడి "జై జై భవానీ" నినాదాలు చేస్తూ అర్చకుల నుండి మాలధారణ స్వీకరించారు.
ఈ కార్యక్రమాన్ని ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ముందుండి నడిపించగా, సీనియర్ ఏ.ఈ.ఓ బి.వి.రెడ్డి, ఫెస్టివల్ సెక్షన్ సునీత, సూపరింటెండెంట్ పర్యవేక్షించారు. ఆలయ స్థానాచార్యులు శివప్రసాద శర్మ, సీనియర్ ఉప ప్రధాన అర్చకులతో కలిసి భక్తులకు మాలలు అందజేశారు. ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, ఇతర అర్చకులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పెద్ద సంఖ్యలో భవానీలు పాల్గొని, అమ్మవారి సన్నిధిలో మాల స్వీకరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.