ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు శాస్త్రోక్తంగా జలహారతి
కొండలు తొలిచి నీటిని తీసుకొచ్చాం
కరువుతో పోరాడిన ఫ్లోరైడ్ బాధితుల మార్కాపురం గడ్డకు ఇక విముక్తి
3 దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేశా
ఇప్పుడు నేనే ప్రారంభోత్సవం చేశా
2019లో గొడ్డలి పార్టీ రాకతో గ్రహణం
వెలిగొండను పూర్తిగా గాలికొదిలేశారు
4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో పెట్టారు
ఎన్నికల ముందు ప్రారంభమంటూ డ్రామాలు
కూటమి రాకతో ఆ గ్రహణం వీడింది
నల్లమల సాగర్‌కు గోదారినీ తెస్తాం: సీఎం
జలవనరుల మంత్రి నిమ్మలపై పొగడ్తలు
పూల సుబ్బయ్య కుమార్తెలకు సత్కారం
వెలిగొండ.. బంగారుకొండ: సీఎం..
ప్రాజెక్టు తొలి దశ జాతికి అంకితం
'శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయల్దేరిన కృష్ణమ్మ.. చెన్నకేశవుడు కొలువై ఉన్న మార్కాపురం నేలకు హారతి ఇస్తోంది. కరువు నేలకు కృష్ణమ్మను తెచ్చాం. ఇది మా నిబద్ధత అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తరాలుగా నష్టపోయిన ఈ ప్రాంతాన్ని ఆదుకునే అవకాశాన్ని భగవంతుడు తనకిచ్చాడని ఒకింత భావోద్వేగంతో అన్నారు. వెలిగొండ.. బంగారుకొండ అని.. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. కృష్ణమ్మ నీటినే కాక నల్లమల సాగర్ (వెలిగొండ రిజర్వాయర్)కు గోదావరి జలాలను కూడా తెస్తామని ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా.. ప్రత్యేకించి ప్రస్తుత మార్కాపురం జిల్లాతోపాటు నెల్లూరు, కడప జిల్లాల పరిధిలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద ముఖ్యమంత్రి సోమవారం జాతికి అంకితం చేశారు. సొరంగ మార్గాల ద్వారా బిరబిరా వచ్చిన కృష్ణమ్మకు ఫీడర్ కాలువలో శాస్త్రోక్తంగా జలహారతి ఇచ్చారు. కాలువ నీటిలో దిగి పసుపు, కుంకుమ, చీర సమర్పించి.. పూలుజల్లి హారతి పట్టారు. అనంతరం
మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పైలాను ఆవిష్కరించారు. ఆ తర్వాత నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. వెలిగొండకు మూడు దశాబ్దాల క్రితం తాను శంకుస్థాపన చేస్తే.. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం రూ.10,200 కోట్లకు చేరిందన్నారు. ఇప్పటి వరకు రూ.7,983 కోట్లు ఖర్చుకాగా.. అందులో 50 శాతం టీడీపీ ప్రభుత్వ కాలంలోనే చేశామన్నారు. నిర్మాణంలో అనేక ఆటంకాలు ఎదురయ్యాయని.. కొండలు అడ్డు వస్తే తొలుస్తూ.. సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగామని చెప్పారు. 'చంద్రబాబు అనే నేను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక మార్కాపురం ప్రాంతానికి వస్తే వెలిగొండ గురించి కరువు బారిన పడిన ప్రజలు చెప్పారు. నీరు ఎక్కడి నుంచి తీసుకురాగలమని అడిగితే కృష్ణా నీటిని ఐదేళ్లకోసారి ఇచ్చినా కనీసం తాగడానికి అయినా ఉ చూసి పకరిస్తాయన్నారు. ఇక్కడి పరిస్థితిని చలించిపోయి.. మూడు దశాబ్దాల క్రితం 1996 మార్చి 5న వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా. మళ్లీ 30 ఏళ్ల తర్వాత నేనే తొలి దశను ఆరంభించా' అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..
వైసీపీది ఫేక్ డ్రామా, సినిమా సెట్టింగ్‌లు
గత వైసీపీ పాలనలో విలువైన పనులను గాలికొదిలేసి నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి అరకొర చెల్లింపులతో మోసం చేశారు. ఎన్నికలకు నెల ముందు ప్రాజెక్టును పూర్తిచేశామని.. జాతికి అంకితం చేస్తున్నట్లు డ్రామాలాడారు. నీరివ్వకుండా.. నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా.. ఇంకా రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉంచుకొని ఫేక్ డ్రామాలు, సినిమా సెట్టింగులతో రైతులను, ప్రజలను మోసం చేసిన వ్యక్తులను ఏమనాలి? 'ఫేక్ మాటలతో మోసం చేసిన వారిని నిలదీయాలి. వారి హయాంలో సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ఇరుక్కుపోయి పనులు కూడా పూర్తికాలేదు. అలాంటి వాటిని పూర్తిచేసి ఇప్పుడు నీళ్లు ఇచ్చాం. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితుల త్యాగం గొప్పది. భూములు, ఇళ్లు, ఊర్లు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా వారి త్యాగం లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది. నిర్వాసితులకు రూ.910 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉ ండగా 48 రోజుల్లో 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు అందజేశాం. వారి ఆర్థిక కష్టాలు, అవసరాలు గుర్తించి కటాఫ్ డేట్‌ను పెంచి మరో రూ.169 కోట్లు అదనపు సాయం చేస్తున్నాం.
నిమ్మల మంచి టీమ్ లీడర్
వెలిగొండ ప్రాజెక్టు పనుల పర్యవేక్షణలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడి కృషి భేష్. ఆయన మంచి టీమ్ లీడర్. ఆయన కృషితో ప్రాజెక్టును అనుకున్న సమయానికి ప్రారంభించగలిగాం.
..చూస్తామని అనుకోలేదు: వూల సుబ్బయ్య కుమార్తెలు
వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటాన్ని ప్రారంభించిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ పూల సుబ్బయ్య కుటుంబసభ్యులను ప్రత్యేకంగా సభకు ఆహ్వానించారు. ఆయన కుమార్తెలు విలాసిని, నునందినిలను సీఎం సత్కరించారు. వెలిగొండను పూర్తిచేస్తారని, దానిని చూస్తామని తాము ఎప్పుడు అనుకోలేదని, అలాంటిది చేసి చూపించారంటూ వారు చంద్రబాబు కాళ్లకు నమ-స్మరించారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్, పొంగూరు నారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2028కి రెండో దశ పూర్తిచేస్తాం
వెలిగొండ తొలిదశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4లక్షల మందికి తాగునీరు ఇస్తాం. మరో రూ.190 కోట్లు ఖర్చుచేసి రెండో దశను 2028 నాటికి పూర్తిచేసి 4 జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు ఇస్తాం. ఈ ప్రాజెక్టుతో కరువుతో నిత్యం పోరాడుతూ అలసిపోయి ఫ్లోరైడ్ బారిన పడిన పశ్చిమ ప్రకాశం ప్రజలకు, మార్కాపురం గడ్డకు విముక్తి లభిస్తుంది. 11 ఏళ్లు అధికారంలో ఉన్న వైఎస్, జగన్ పూర్తిచేయలేకపోయిన ప్రాజెక్టును నేను పూర్తిచేశాను. ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడదాం. చెడును బండించి మంచి చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఉత్తరాంధ్రలో భోగాపురం వెలుగులు, రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి, కరువు ప్రాంతంలోకి కృష్ణమ్మను పరుగులు పెట్టించాం. సీమ హార్టీకల్చర్ హబ్‌లో మార్కాపురాన్నీ భాగం చేశాం. జిల్లా ఏర్పాటు, వెలిగొండ నిర్మాణం, హార్టీకల్చర్ హబ్‌లో చేరికతో ఈ జిల్లా ఇక అన్జవబుల్. దక్షిణ భారతంలో గోదావరి-కావేరి అనుసంధానం కావాలి.. ఉత్తర భారతంలో గంగా-మహానది అనుసంధానంతో దేశం సుభిక్షమవుతుంది. వీటిపై ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయమండలి సమావేశంలో కూడా చర్చించాం.
సంప్రదాయ పంచెకట్టుతో ఉల్లాసంగా..
తెలుగు సంప్రదాయ పంచె కట్టుతో వెలిగొండ సొంరంగాల ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు జల హారతి ఇచ్చారు. కృష్ణా జలాలు పసుపు కుంకుమలు చల్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర జలాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులపై చల్లి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఫీడర్ కాలువ వద్ద కృష్ణమ్మ ప్రవాహానికి ముఖ్యమంత్రి సాష్టాంగ నమస్కారం చేశారు. సంప్రదాయ నృత్యాలతో కృష్ణా జలాలకు గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. బహిరంగ సభా వేదికపై ఏర్పాటు చేసిన ర్యాంపుపై కండువా తిప్పుతూ రైతులకూ, ప్రజలకూ ముఖ్యమంత్రి అభివాదం చేశారు. దివంగత పూలసుబ్బయ్య కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించి సన్మానించారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు పనిచేసిన అధికారులు, ఉద్యోగాలు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి. నారాయణ, కందుల దుర్గేష్, కొలును పార్థసారధి, అనగాని సత్యప్రసాద్, గుమ్మిడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
దశాబ్దాల కల నెరవేరిన తరుణమిది
వెలంగొండ ప్రారంభంపై ఎక్స్ వేదికగా పవన్ హర్షం
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలు కరవు పీడిత ప్రాంతాలకు చేరనున్న ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీ పూల నుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కావడం మార్కాపురం, ప్రకాశం, కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజలకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారం కావడానికి మూడు దశాబ్దాలుగా కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంస్థలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం 7,300 మందికి పైగా తమ ఇళ్లు.. భూములు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం రూ.905 కోట్లు విడుదల చేయగా.. ఇప్పటికే రూ.768 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. 1996లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని.. నేడు ఆయన నాయకత్వంలోనే తొలి దశ ప్రారంభం అవుతోందని పవన్ గుర్తుచేశారు. చంద్రబాబు దూరదృష్టి, సంకల్పం కరవు ప్రాంతాల్లో జల సిరులు పారించనుందని పేర్కొన్నారు. మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో జల్ జీవన్ మిషన్? అమరజీవి జలధార కింద చేపడుతున్న మెగా వాటర్ గ్రిడ్ పథకానికి వెలిగొండ ప్రధాన నీటి వనరుగా నిలవనుందని తెలిపారు. ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్ప సాధనలోనూ ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ.. ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.