చిన్నతరహా పరిశ్రమలు, డ్వాక్రాలకు రుణాలు అందాలి
రుణాల రీ షెడ్యూల్ అవకాశాన్ని వినియోగించుకోవాలి
ప్రకృతి సేద్యం చేసే వారికి విరివిగా రుణాలివ్వండి
బ్యాంకర్ల స్థాయి మీటింగ్ లో కలెక్టర్లను కూడా ఆహ్వానించాలి
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి: రుణాల రీషెడ్యూల్ రూ.1,108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలు, వివిధ కీలక రంగాలు అభివృద్ధి జరిగేలా బ్యాంకర్ల సహకారం అందించాలని కోరారు. వ్యాపారాల్లో బలహీనవర్గాలకు చేయూతనిచ్చే ఎంఎస్ఎంఈలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అమరావతిలో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం, బ్యాంకర్లే వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరముంది. వాటి పోత్సాహంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. వైకాపా పాలనలో వ్యవస్థలు గాడి తప్పి ప్రభుత్వానికి క్రెడిబులిటీ పోయింది. పెద్ద ఎత్తున వడ్డీలకు అప్పులు తెచ్చారు. క్రెడిబులిటీ ఉంటే తక్కువ వడ్డీలకు రుణాల తీసుకురావొచ్చు. రాష్ట్రంలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశామని అన్నారు. ఇప్పటి వరకు రూ.49 వేలకోట్లు రీషెడ్యూల్ చేశాం. ప్రకృతి సేద్యం మరింత విస్తరించేందుకు బ్యాంకర్ల నుంచి ప్రోత్సాహం అండాలి. ఇకపై బ్యాంకర్ల సమావేశానికి జిల్లా కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశర చేశారు. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. వ్యవసాయం సహా ఏ అవసరం వచ్చినా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు తీసుకునే పరిస్థితి రావాలని.. బ్యాంకర్లు ఆ దిశగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీకి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయని వెల్లడించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని.. రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి బ్యాంకర్లు ఇచ్చే రుణాలపై మరింత చొరవ చూపాలని దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు పెద్దఎత్తున ఇవ్వాలని.. అప్పుడే అన్నిరంగాల్లో వారు ఎదుగుతారని చెప్పుకొచ్చారు. వారికోసం ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందని.. బ్యాంకర్ల వైపు నుంచీ సహకారం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని.. పేద, ధనికుల మధ్య తారతమ్యాలు పోవాలని సూచించారు. రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా చేయాలని భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. బ్యాంకులతో సహా వివిధ ఆర్థిక రంగ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని సీఎం వివరించారు. ఇటీవలే 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని.. సంబంధిత నిర్మాణాలు మరింత ఊపందుకుని త్వరితగతిన పూర్తి కావాలని సూచించారు సీఎం. డ్వాక్రా సంఘాలను బలోపేతం చేసిన విధంగానే.. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను బలోపేతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. టిడ్కో ఇళ్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి తమ వైపు నుంచి ప్రయత్నిస్తున్నామని.. బ్యాంకర్లు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. డ్వాక్రా గ్రూపు బ్యాంక్ ఖాతాలపై 15 రకాల ఛార్జీలు వేస్తున్నారని, బ్యాంకర్లు ఈ ఛార్జీలను తగ్గించాలన్నారు. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని.. వైసీపీ ప్రభుత్వం 22ఏ పేరుతో భూ వివాదాలు సృష్టించిందని ప్రస్తావించారు. ఇప్పుడీ భూ రికార్డులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు.బ్యాంకర్లు కూడా బ్యాంక్ ఖాతాల కోసం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుందేమో ఆలోచించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలావుంటే దావోస్ పర్యటన ముగించుకుని శుక్రవారం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వచ్చీరాగానే నేరుగా సచివాలయానికి చేరుకుని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి హాజరయ్యారు. వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు అందజేశారు. అలాగే కౌలు రైతులకు రూ.1,490 కోట్ల మేర వ్యవసాయ రుణాలిచ్చారు. ఎంఎస్ఎంఈలకు రూ.95,714 కోట్ల మేర రుణాలను బ్యాంకర్లు జారీచేశారు. ఈ సమావేశంలో అమరావతిని ఫ్లై+నాన్షియల్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుపై బ్యాంకర్లతో చంద్రబాబు సమాలోచనలు జరిపారు. అంతేకాకుండా.. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల లింకేజీ, కేంద్ర పథకాలు, స్టార్టప్‌లకు బ్యాంకుల సహకారం వంటి కీలక అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, చీఫ్ సెక్రెటరీ విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం తదితరులు హాజరయ్యారు. అలాగే వివిధ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.